గోదావరి–కావేరి లింక్‌పై రేవంత్‌ సర్కార్‌ జలద్రోహం | Harish Rao Sensational Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

గోదావరి–కావేరి లింక్‌పై రేవంత్‌ సర్కార్‌ జలద్రోహం

Jun 8 2026 5:34 AM | Updated on Jun 8 2026 5:34 AM

Harish Rao Sensational Comments On CM Revanth Reddy

పాలమూరు ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ పేరుతో రాష్ట్ర జల హక్కులను తాకట్టు పెడుతున్నారు 

అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు, అఖిలపక్ష పోరాటానికి బీఆర్‌ఎస్‌ సిద్ధం: హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–నల్లమల సాగర్‌ ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో ముడిపెట్టడం తెలంగాణ జలహక్కులను కాలరాయడమేనని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ హక్కుల కోసం ముందుండి పోరాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

‘968 టీఎంసీల హక్కులే ముందుగా’... 
గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. జీడబ్ల్యూడీటీ (గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్‌) అవార్డు ప్రకారం గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తే తెలంగాణకు 45 టీఎంసీల అదనపు హక్కు ఉంటుందని తాము ముందుగానే హెచ్చరించామన్నారు. నదుల అనుసంధానంపై జరిగిన ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు వచి్చన తర్వాతే తదుపరి చర్చలు జరగాలని పట్టుబట్టామని వెల్లడించారు. అనుసంధానంలో తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని, ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్‌ నుంచి నాగార్జునసాగర్‌కు లింక్‌ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం పోలవరం నుంచి నల్లమలసాగర్, అక్కడి నుంచి కావేరికి నీటిని తరలించే ప్రతిపాదనలో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. 

చంద్రబాబు ప్రయోజనాల కోసమే...
పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలను ఎన్‌ఓసీతో ముడిపెట్టడం ప్రమాదకరమని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణకు ట్రిబ్యునల్‌ ద్వారా రావాల్సిన 1,005 టీఎంసీలతోపాటు మరో 45 టీఎంసీల అంశం పెండింగ్‌లో ఉండగా రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం వదులుకుంటోందని ఆరోపించారు. సమ్మక్కసాగర్, వార్ధా, ఎల్లంపల్లి, లోయర్‌ పెన్‌గంగా వంటి ప్రాజెక్టులకు సంబంధించిన 139 టీఎంసీల అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. గోదావరి–కావేరి లింక్‌ అమలైతే తెలంగాణకు కనీసం 211 టీఎంసీల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిలా కాకుండా చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 

‘ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం
పోలవరం–బనకచర్ల మార్గం ద్వారా నీటిని తరలించాలంటే సుమారు రూ.82 వేల కోట్ల వ్యయం అవుతుందని, తెలంగాణ మీదుగా నదుల అనుసంధానం జరిగితే రూ.48 వేల కోట్లకే సాధ్యమని వివరించారు, దీనిపై కేంద్ర మంత్రులు.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగితే ప్రజా పోరాటానికి బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీమంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్,మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు సంజయ్, చింత ప్రభాకర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement