సంక్షోభంలో సాగునీటి రంగం | Harish Rao Asks Congress Govt About Irrigation Projects Future | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో సాగునీటి రంగం

Jun 28 2025 4:35 AM | Updated on Jun 28 2025 4:35 AM

Harish Rao Asks Congress Govt About Irrigation Projects Future

ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న హరీశ్‌రావు

మాజీ మంత్రి హరీశ్‌రావు  

ప్రాజెక్టుల్లో ప్రమాదాలు కిషన్‌రెడ్డికి కనిపించడం లేదా?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాగునీటి రంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ రంగానికి కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యతనిచ్చి బాగు చేస్తే, ప్రాజెక్టులను పడావు పెట్టి, నిర్వహణ గాలికి వదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి మేడిగడ్డపై దు్రష్పచారం మానుకోవాలని, ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అంటూ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హరీశ్‌రావు విమర్శించారు. ‘ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. నల్లగొండలో సుంకిశాల కుప్ప కూలింది. పాలమూరులో వట్టెం పంప్‌ హౌస్‌ జలమయమైంది. నల్లగొండలో ఎస్‌ఎల్‌బీసీ కుప్పకూలింది. జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్‌ తెగిపోయాయి. మంజీర డ్యామ్‌ ఆప్రాన్‌ వరద ధాటికి కొట్టుకుపోగా, పియ్యర్స్‌లలో పగుళ్లు వచ్చాయి. కాంగ్రెస్‌ చేతగానితనం వల్లే ఈ ప్రమాదాలు జరిగినా ఎన్‌డీఎస్‌ఏకు కనిపించవు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన వెంటనే ఎన్‌డీఎస్‌ఏకు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరిగిన ప్రమాదాలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. బనకచర్ల ద్వారా ఏపీకి నీళ్లు తరలించే కుట్ర జరుగుతోందని అన్నారు. రాజకీయ ఎజెండాల కోసం తెలంగాణకు ప్రాణాధారం అయిన సాగునీటి రంగాన్ని బలి చేయొద్దని హరీశ్‌రావు హితవు పలికారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో జరిగిన 142 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలు కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శించారు. పటాన్‌చెరు ఆటోడ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందని వారు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. సీఎం రేవంత్‌ ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement