
అన్యాయం చేసిన అధికారులపై కేసు నమోదు చేయండి
మిడ్‌మానేరు బాధితుడు చెల్లా బాలరాజు
సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి గీతేకు వినతి
సిరిసిల్లక్రైం: అధికారుల తీరుతో పదేళ్లుగా తనకు అన్యాయం జరుగుతోందని, తనలాంటి బాధితులకు న్యాయం చేసేలా నక్సలైట్‌గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితుడు చల్లా బాలరాజు కోరారు. ఈమేరకు శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బాధితుడు బాలరాజు మాట్లాడుతూ రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో నిర్మించిన మిడ్‌మానేరు ప్రాజెక్టులో స్థలం కోల్పోయానని తెలిపాడు.
అధికారులు తనకు పదేళ్లుగా నష్టపరిహారం చెల్లించకుండా దరఖాస్తులు, పరిశీలన అంటూ కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు మిగతా వారికి నష్టపరిహారం, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు.
ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన సందీప్‌కుమార్ ఝా నిర్వాసితుల సమస్యలపై అవహేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులపై కేసు నమోదు తమ పరిధిలో లేదని ఎస్పీ తెలిపినట్లు చెప్పారు. జిల్లాకు కొత్తగా రానున్న కలెక్టర్ రెవెన్యూ విభాగంలోని చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారని ఎస్పీ సూచించారని తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో ఇనుకొండ లక్ష్మి, మంజుల, తిరుపతి, ఉపేందర్ ఉన్నారు.