‘శిఖం’లో నిర్మాణానికి అనుమతిపై పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
మందిర నిర్మాణానికి ఎలా అనుమతి ఇస్తారు?
సాక్షి, హైదరాబాద్: చెరువు శిఖం భూమిలో మందిర నిర్మాణానికి కలెక్టర్ అనుమతి ఎలా ఇస్తారని, నిధులు ఎలా విడుదల చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్ట ప్రకారం నిధులు విడుదల చేశారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసులో కలెక్టర్‌ను నిందితుడిగా ఎందుకు చేర్చలేదని పోలీసులను అడిగింది. ఇరుపక్షాలు పూర్తి వివరాలతో రావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
భూపాలపల్లి పట్టణంలో పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి 2024, జనవరిలో స్థానిక కోర్టును ఆశ్రయించారు. శిఖం భూమి 2 ఎకరాలు కబ్జా చేసి వెంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
జనవరి 16న తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సుధాంశురావు వాదనలు వినిపిస్తూ.. రెండు పిటిషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ పిటిషన్ వేస్తామని చెప్పారు.
దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుని నిందితులను చేర్చడంపై వ్యాఖ్యలు చేయొద్దని సుధాంశురావు కోరగా, న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసంహరణకు నిరాకరిస్తూ.. కలెక్టర్, పో లీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ జో క్యం ఉండటంతో చార్జిషీట్ దాఖలు చేయడం తా త్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారుల నుంచి పత్రాలు అందని కారణంగా ఆలస్యం జరిగిందని ఏపీపీ చెప్పగా.. మరి, రెండే ళ్లుగా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెరువులో మందిర నిర్మాణానికి కలెక్టరే అనుమతి ఇస్తే.. ఇక రేపు చెరువులన్నీ ఇలాగే మారతాయన్నారు.


