రుక్మాపూర్‌లోనూ పులి అడుగులు
చొప్పదండి: జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన పులి సంచారం మండలంలోని రుక్మాపూర్‌కు చేరింది. రుక్మాపూర్ శివారులోని పొలం గట్లపై పులి సంచరించిన ఆనవాళ్లను స్థానిక రైతులు బుధవారం గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షౌకత్ హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పులి అడుగులను సేకరించారు.
రుక్మాపూర్ నుంచే పయనం..!
రుక్మాపూర్ శివారు నుంచే పులి వెదురుగట్ట వైపు వెళ్లిందని ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల క్రితమే ఈ గ్రామంలో సంచరించినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. పులి అడుగులు రుక్మాపూర్‌లో తూర్పు వైపు ఉండడంతో అది వెదురుగట్ట శివారుకు వెళ్లి ఉంటుందని చెబుతున్నారు. వెదురుగట్ట, బహుద్దూర్‌ఖాన్‌పేట నుంచి పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్ గ్రామం మీదుగా ఆ జిల్లాలో ప్రవేశించిందని అనుమానాలు బలపడుతున్నాయి. కాగా, రుక్మాపూర్ నుంచి కరీంనగర్ పట్టణం వైపు పులి వెళ్లి ఉండవచ్చని అనుమానించినా, దాని అడుగుల గుర్తుల ప్రకారం పెద్దపల్లి జిల్లాకు వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లి డీఎఫ్‌వో శివయ్య ఈ మేరకు మండలంలో పర్యటించి పులి అడుగులు ఎటువైపు పడ్డాయని పరిశీలించారు. అయితే పులి సంచరిస్తున్నట్లు అనుమానాలు నిజమవడంతో రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరారు. ఉదయం 7 గంటల వరకు, సాయంత్రం 5 గంటల తర్వాత వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లరాదని, ఒక వేళ వెళ్తే గుంపుగా వెళ్లడమే మంచిదని సూచించారు.
ఇక్కడి నుంచే వెదురుగట్ట శివారుకు..
అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాకు వెళ్లినట్లు భావిస్తున్న అధికారులు


