‘పవర్‌’ఫుల్‌ పోస్టులే కావాలి | GHMC Senior Officials Related Posts Issue | Sakshi
Sakshi News home page

‘పవర్‌’ఫుల్‌ పోస్టులే కావాలి

Sep 26 2025 8:23 AM | Updated on Sep 26 2025 8:41 AM

GHMC Senior Officials Related Posts Issue

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌.. తాను బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలం నుంచే అంతర్గత బదిలీల చర్యలు చేపట్టారు. వాటివల్ల ప్రయోజనం కలుగుతుందని ఆయన భావించినప్పటికీ సత్ఫలితాలు కనిపించడం లేదు. స్వల్ప కాలంలోనే తరచూ బదిలీలతో కొందరు.. ఉన్నత స్థానాల్లోంచి వాటికంటే తక్కువ అధికారం ఉన్న స్థానాల్లో నియమించారని కొందరు.. అసలు పనులే చేయడం లేదు. తమ స్థాయికి తగిన పోస్టులివ్వలేదని కొందరు డ్యూటీలకు రావడమే మానేశారు.

ఆ మాటకొస్తే.. కర్ణన్‌ను కమిషనర్‌గా నియమించాక జీహెచ్‌ఎంసీలో ఆయన కంటే సీనియర్‌ అయిన ఐఏఎస్‌ అధికారి ఒకరు జీహెచ్‌ఎంసీకే రాలేదు. దాంతో ప్రభుత్వం ఆయనను రాష్ట్రస్థాయి పోస్టుకు బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ  ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్లు, సర్కిళ్ల పరిధుల్లో డిప్యూటీ కమిషనర్లుగా ఉన్న వారిని ఆ స్థాయి కంటే తక్కువ స్థాయివిగా భావించే జాయింట్‌ కమిషనర్లుగా నియమించడంతో కొందరు అసలు విధులకే రాకుండా మానేశారు. కొందరు తప్పదన్నట్లు సదరు పోస్టుల్లో చేరినా అసలు పనులు మాని, తాము కోరుకున్న పోస్టుల కోసం సచివాలయం చుట్టూ, మంత్రుల చుట్టూ, ఇతరత్రా రాజకీయనేతల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీలో పని ఒత్తిడి తీవ్రంగా ఉన్న ఓ విభాగంలో ముగ్గురు జాయింట్‌ కమిషనర్లను నియమిస్తే.. ఇద్దరు తమకు ఇచ్చిన పనులు మాని పైరవీల వేటలోనే ఉన్నట్లు తెలుస్తోంది.  

కొందరికి తక్కువ.. కొందరికి ఎక్కువ
మరోవైపు కొందరు ఉన్నతాధికారులకు మాత్రం అదనపు భారం పడుతోంది. వాస్తవానికి జీహెచ్‌ఎంసీలో జోనల్‌ కమిషనర్లకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జీహెచ్‌ఎంసీ స్థాయిలో కమిషనర్‌ కంటే కూడా జోనల్‌ స్థాయిలో వారికే ఎక్కువ పనులుంటాయి. అలాంటిది కొందరు జోనల్‌ కమిషనర్లకే ఇతరత్రా విభాగాల అదనపు బాధ్యతలు కూడా అప్పగించడంతో వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. బాగా పని చేస్తారని బరువంతా వారిపైనే మోపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక జోనల్‌ కమిషనర్‌.. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో కీలక స్థానంలో ఉన్నారు. మరో జోనల్‌ కమిషనర్‌కు కీలకమైన జోనల్‌ బాధ్యతలతో పాటు ప్రధాన కార్యాలయంలోనూ కీలకమైన ఐటీ, రెవెన్యూ విభాగాల బాధ్యతలున్నాయి.  

అధిక నిర్మాణాలతో పాటు అధిక పనులుండే మరో జోనల్‌ కమిషనర్‌కు ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విభాగం బాధ్యతలప్పగించారు. వారందరూ ప్రతిరోజూ రెండు పోస్టుల నిర్వహణకు గాను దూరంగా ఉన్నప్పటికీ రెండు కార్యాలయాలకు వెళ్లక తప్పని పరిస్థితి. ఇదే తరుణంలో ప్రధాన కార్యాలయంలోని కొందరు అడిషనల్‌ కమిషనర్లకు మాత్రం పేరుకు మాత్రం రెండేసి విభాగాలున్నప్పటికీ, వాటిల్లో చేసేందుకు పెద్దగా పనేమీ ఉండదు. అయినప్పటికీ, విద్యుత్‌ విభాగానికి మాత్రం అడిషనల్‌ కమిషనర్‌ లేరు. నగరంలో అత్యంత సమస్యాత్మక అంశాల్లో వీధిదీపాల సమస్య ప్రధానమైనది. అయినప్పటికీ, వీధిదీపాలను పర్యవేక్షించేందుకు విద్యుత్‌ విభాగానికి అడిషనల్‌ కమిషరే లేదు. చేసేవారికి అదనపు భారం. చేయని వారికి నామమాత్రం. ఇంకొందరు ఎక్కడుంటారో, ఏంచేస్తారో తెలియదు. పోస్టు మాత్రం జీహెచ్‌ఎంసీలో ఉంటుంది. ఇదీ జీహెచ్‌ఎంసీ తీరు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement