ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌ | Allu Arjun Announced As Best Actor And Nivetha Thomas As Best Actress In Gaddar Awards, Check Full List Inside | Sakshi
Sakshi News home page

Gaddar Film Awards: ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

May 30 2025 1:09 AM | Updated on May 30 2025 1:15 PM

Gaddar Film Awards: Allu Arjun Best Actor announced Jury

ఉత్తమ నటి నివేదా థామస్‌.. ఉత్తమ దర్శకుడు నాగ్‌అశ్విన్‌ 

ఉత్తమ చిత్రాలుగా కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్‌ 

లక్కీభాస్కర్,కల్కికి 4 చొప్పున అవార్డులు 

జూన్‌ 14న ఘనంగా అవార్డుల ప్రదాన కార్యక్రమం

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ప్రకటించిన జ్యూరీ

సాక్షి, హైదరాబాద్‌: పుష్ప–2 సినిమాలో నటనకుగాను అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా గద్దర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు)  గెలుచుకున్నారు. ప్రజా వాగ్గేయకారుడు, ఉద్యమకారుడు గద్దర్‌ పేరుపై ఏర్పాటుచేసిన సినిమా అవార్డులను తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజుతో కలసి గద్దర్‌ అవార్డుల జ్యూరీ చైర్‌పర్సన్, నటి జయసుధ గురువారం అవార్డుల వివరాలను ప్రకటించారు. 

మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి 2898ఏడీ, రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్‌ అవార్డులు గెలుచుకున్నాయి. మొత్తం 11 కేటగిరీల్లో 1,248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలిపారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా అవార్డులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 14వ తేదీన విజేతలకు గద్దర్‌ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 

రెండు చిత్రాలకు నాలుగేసి అవార్డులు 
గద్దర్‌ అవార్డుల్లో కల్కి 2898ఏడీ, లక్కీ భాస్కర్‌ సినిమాలు నాలుగు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ స్కీన్ర్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్, స్పెషల్‌జ్యూరీ అవార్డులు లక్కీ భాస్కర్‌ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తం ఆర్ట్‌ డైరెక్టర్, ఉత్తమ కాసూ్టమ్‌ డిజైనర్‌ కేటగిరీల్లో కల్కి అవార్డులు గెలుచుకుంది. 

రజాకార్‌ సినిమా చారిత్రక విభాగంలో ఫీచర్‌ హెరిటేజ్‌ చిత్రం అవార్డుతోపాటు ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ విభాగంలో అవార్డులు దక్కించుకుంది. అన్ని కేటగిరీల్లోనూ 2024కు సంబంధించి గద్దర్‌ సినిమా అవార్డులను ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వబోతోందని దిల్‌ రాజు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా ఎంపిక జరిగిందని చెప్పారు. 

పారదర్శకంగా స్క్రీనింగ్‌ చేసి బెస్ట్‌ ఆఫ్‌ బెస్ట్‌ను ఎంపిక చేసినట్లు జయసుధ వివరించారు. 2014, జూన్‌ నుంచి 2023, డిసెంబర్‌ వరకు విడుదలైన ఉత్తమ చిత్రాలకు త్వరలో అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందంటూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  


చిత్రాల విభాగంలో అవార్డులు 
మొదటి ఉత్తమ మొదటి చిత్రం: కల్కి  
రేండో ఉత్తమ చిత్రం: పొట్టేల్‌  
ఉత్తమ మూడవ చిత్రం: లక్కీ భాస్కర్‌  
జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతిపై బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: కమిటీ కుర్రోళ్లు  
ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు 
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: యదువంశీ (కమిటీ కుర్రోళ్లు)  
ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఆయ్‌  
చారిత్రక విభాగంలో ఫీచర్‌ హెరిటేజ్‌ చిత్రం: రజాకార్‌  


వ్యక్తిగత విభాగంలో అవార్డులు 
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప 2)  
ఉత్తమ నటి: నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు)  
ఉత్తమ దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌ (కల్కి)  
ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం) 
ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌) 
ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్‌ (రజాకార్‌) 
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌ (ఊరి పేరు భైరవకోన–నిజమే నే చెబుతున్నా..)  
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (పుష్ప 2– సూసేటి అగ్గిరవ్వ)  
ఉత్తమ హాస్యనటులు: సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తు వదలరా–2)  
ఉత్తమ బాలనటులు: మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌ పోతుల (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్‌) 
ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)  
ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్‌)  
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (రాజు యాదవ్‌)  
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్‌ రెడ్డి (గామి)  
ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)  
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ మేనన్‌ (గామి)  
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (దేవర)  
ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: నితిన్‌ జిహానీ చౌదరీ (కల్కి)  
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌: కె. చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)  
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)  
ఉత్తమ కాస్టూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌ కుమార్‌ (కల్కి) 

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు 
దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌) 
అన్యన్య నాగళ్ల (పొట్టేల్‌) 
సుజిత్, సందీప్‌ (కేఏ) 
ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ (రాజు యాదవ్‌) 
స్పెషల్‌ మెన్షన్‌: ఫరియా అబ్దుల్దా (మత్తు వదలరా–2) 
తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: మన సినిమా ఫస్ట్‌ రీల్‌ (రెంటాల జయదేవ్‌) 

Advertisement
 
Advertisement
Advertisement