
ఇటీవల మారిన అంతిమ యాత్ర తీరు
జ్ఞాపకాలు గుర్తు చేస్తూ కన్నీళ్లు పెట్టిస్తున్న పాటలు
కట్టిపడేస్తున్న డప్పు కళాబృందాల ప్రదర్శన
‘తోడుగా మాతోడుండీ.. నీడగా మాతో నడిచి నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా.. నీ జ్ఞాపకాలూ మరువామయ్యా కొమురయ్యా.. కొడుకునెట్లా మరిసినావే కొమురయ్యా.. నీ బిడ్డనెట్లా మరిసినావే కొమురయ్యా.. బలగాన్నీ మరిసినావే కొమురయ్యా’ అంటూ బలగం సినిమాలో పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే. ఆఖరి మజిలీలో చనిపోయిన వ్యక్తితో కుటుంబానికి, బంధుగణానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పాటలు పాడడం ఇప్పుడు ఓరుగల్లులో ఆనవాయితీగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా డప్పు కళాకారుల రాగం.. భావోద్వేగాన్ని పలికిస్తోంది. అదే ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం!
– సాక్షి, వరంగల్
ఇన్ని రోజులు కలిసి ఉండి.. ఒక్కసారిగా కుటుంబంలో ఒకరు దూరమైతే కుటుంబ సభ్యులు తట్టుకోలేరు. వారి జ్ఞాపకాలు వెంటాడతాయి. వారితో ఉన్న అనుబంధాలు మదిలో మెదులుతాయి. ఇన్నాళ్లూ అంతిమయాత్రలో డప్పుచప్పుళ్లు, అందుకు అనుగుణంగా స్టెప్పులు వేసేవారు. ఇప్పుడు డప్పుకళాకారుల నోటి నుంచి వస్తున్న బంధాలను పెనవేసే పాటలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కుటుంబ పెద్ద మరణించినప్పుడు బలగం సినిమాలో పాడిన పాట, డప్పు కళాకారుల ప్రదర్శన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఏళ్ల కిందటి సంప్రదాయం. ఇప్పుడు మరింత ట్రెండీగా మారింది.
బలగం సినిమాకు ముందే...
15 ఏళ్ల క్రితమే చెన్నారావుపేట మండలం పాపాయ్యపేట యాకన్న బృందం అంత్యక్రియల్లో పాటలు పాడడం ప్రారంభించింది. ఆతర్వాత నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన యాకాంబరం బృందం కూడా బంధుత్వ విలువలు తెలిసేలా పాటలు పాడడం మొదలు పెట్టింది. అయితే బలగం సినిమా విడుదలైన తర్వాత ఈ డప్పు కళా బృందాలకు ముఖ్యంగా పాటలు పాడే వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎవరు మరణించినా.. అప్పటికప్పుడు వారి గుణగణాలు తెలుసుకుని పాటలు అల్లుతూ పాడుతూ కళాకారులు కన్నీళ్లు పెట్టిస్తున్నారు.
డప్పుచప్పుళ్లు.. పాటలు
‘నేనెళ్లి పోతున్నా దూరం.. మన ఇల్లు, నీ పిల్లలు పదిలం.. మన బంధు బలగం పదిలం.. అని పైనుంచి తన ఆత్మ ద్వారా సుశీలవ్వ మనకు చెబుతున్నది’ అంటూ నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన డప్పు కళా బృందం వరంగల్‌జిల్లా అనంతారంలో పాడిన పాట ఆఖరి మజిలీకి వచ్చినవారందరినీ కంటతడి పెట్టించింది. ఇలా డప్పు కళాకారులు, జానపదులు పాడుతున్న పాటలు బంధాలను బలోపేతం చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి.
నా భర్త చనిపోయినప్పుడు ఇదే పాట పాడిన..
దుగ్గొండి: నా భర్త పస్తం మొగి లి చనిపోయినప్పుడు సైతం పుట్టెడు దుఃఖంలో ఉన్న నేను పాటతో ఆయనకు కన్నీటి నివా ళి అర్పించాను. ఆయన నేర్పిన కళను ఆయన చివరి మజిలీకి చేరే వరకు వినిపించా.. నాతోటి కళాకారులు సైతం పాట పాడుతూ వచ్చారు. నేడు చావు సందర్భాల్లో పాటలు పాడే క్రమంలో చనిపోయిన వ్యక్తికి ఉన్న పేరు ప్రతిష్టలు, సేవా గుణం, బంధువులతో బంధుత్వం తెలుసుకుని కళాకారులు పాటతో కన్నీరు పెట్టిస్తున్నారు.
– పస్తం కొంరమ్మ, బలగం ఫేమ్, దుగ్గొండి
చాలా ఏళ్ల నుంచి పాడుతున్నాం..
చాలా ఏళ్ల నుంచి మేం 12 మంది సభ్యులతో డప్పు కళాబృందం ఏర్పాటు చేసుకున్నాం. మ నిషి చనిపోయిన సమయంలో వారు తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమనుకుంటున్నారనే మాటలతో అప్పటికప్పుడు పాటలు రాసుకుని పాడతాం. మా పాటలతో పెద్ద గొడవలు ఉన్న ఫ్యావిులీలు మారిన సందర్భాలూ ఉన్నాయి. చాలామంది మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబీకుల ఆఖరి మజిలీలో పాటలు పాడాలని అడుగుతున్నారు.
– సౌరపుయాకాంబరం, దీక్షకుంట, గ్రామ డప్పు కళాబృందం, నెక్కొండ
ఆదరణ పెరిగింది..
మాది చెన్నారావుపేట మండలం పాపయ్యపేట డప్పు కళా బృందం. 22మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని 14 ఏళ్ల క్రిత మే ఏర్పాటు చేసుకున్నాం. ఓవై పు డప్పుచప్పుళ్లతో పాటు ఇంకోవైపు పాటలు పా డుతున్నాం. అయినా అప్పుడు పెద్దగా ఆదరణ ఉండేది కాదు.ఇటీవల చాలామంది మా పాటలను సో షల్ మీడియాలో పోస్టు చేస్తుండడంతో మాకు గిరా కీ పెరిగింది.ఇందుకు అనుగుణంగానే సరికొత్త చరణాలతో అప్పటికప్పుడు పాటలురాస్తూ.. పాడు తూ బంధాలను మరింత బలోపేతం చేస్తున్నాం.
– అబ్బదాసి యాకన్న,డప్పు కళాకారుడు