
మంటగలుస్తున్న మానవ సంబంధాలు
చంపేసి.. కాల్చేసి.. ఆపై ముక్కలుగా నరికి..
నగరంలో తరచుగా అమానుష హత్యలు
ఆధారాలు మాయం చేయడానికి ఎత్తుగడలు
తాజాగా మేడిపల్లిలో కలకలం రేపిన హత్యోదంతం
హైదరాబాద్‌లో తరచుగా డర్టీ మర్డర్స్ వెలుగుచూస్తున్నాయి. మానవత్వం మరిచిన కొందరు తమవారి విషయంలోనూ విచక్షణ కోల్పోతున్నారు. క్షణికావేశం, కక్షలు, కార్పణ్యాలు, పక్కా పథకం ప్రకారం.. ఇలా కారణమేదైనా హత్య చేసిన తర్వాత మృతదేహాలను మాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హత్య చేసిన తర్వాత మృతదేహాలను కాల్చేయడం, ముక్కలు చేసేయడం, కుక్కర్‌లో ఉడికించడం... ఇలా ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘోరాల్లో అత్యధికం సాక్ష్యాధారాలు మాయం చేయడానికేనని, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజాస్టర్ కూడా కారణమని సైకాలిజిస్టులు చెబుతున్నారు. నగరంలో జరిగిన కొన్ని దారుణ ఘటనలు ఇలా ఉన్నాయి..
సిమెంట్ దిమ్మెలో నవీష్ శవం..
‘జనహర్ష’ అధినేత రమణ మూర్తితో ఆర్థిక విభేదాల నేపథ్యంలో అతడి పార్ట్‌నర్ నవీన్ మూర్తి 2005లో దారుణ హత్యకు గురయ్యాడు. రమణమూర్తి, ఇన్‌స్పెక్టర్ విజయ్‌సింగ్ మరికొందరు కలిసి నవీణన్ మూర్తిని ఉప్పల్ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న తమ పరిచయస్థుడి ఇంట్లో హత్య చేశారు. శవాన్ని వంటింట్లో పడేసి, కాంక్రీట్‌ను దిమ్మగా పోసేశారు. ఆ ఇంటి వెనుక నివసించే ఓ మహిళ ఇచి్చన సమాచారంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచి్చంది.
ముక్కలు చేసి.. మూసీలో పడేసి..
మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే మహేందర్‌రెడ్డి గర్భవతి అయిన తన భార్య స్వాతి అలియాస్ జ్యోతిని దారుణంగా చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి, మొండెం మినహా మిగిలిన భాగాలు మూసీ నదిలో పడేశాడు. ఆదివారం ఉదయం ఈ ఉదంతం వెలుగులోకి రాగా... నిందితుడిని విచారిస్తున్న పోలీసులు మృతదేహం అవశేషాల కోసం మూసీ తీరం మొత్తం గాలిస్తున్నారు.
గోనె సంచుల్లో మూటకట్టి..
2003లో వెలుగులోకి వచి్చన ప్రభాకర్ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. యూసుఫ్‌గూడలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించే ప్రభాకర్ ఫైనాన్స్ వ్యాపారి కూడా. పుట్టిన రోజు కార్డులు ప్రింటింగ్ చేయించుకోవడానికి వచి్చన శైలజతో అతడికి పరిచయమైంది. ప్రభాకర్ నుంచి శైలజ రూ.లక్షల్లో అప్పు తీసుకుంది. తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో ప్రభాకర్‌ను ఇంటికి పిలిచి, కూల్‌డ్రింక్‌లో నెయిల్ పాలిష్ రిమూవర్ కలిపి మత్తులోకి దింపింది. ఆపై చంపేసి చేసి శవాన్ని ఐదు భాగాలుగా కోసి, గోనె సంచుల్లో కట్టి వంటింటి నుంచి టెర్రస్ వరకు ఐదు చోట్ల దాచింది.
పాలేరులో పడేశారు..
కర్నూలు జిల్లాకు చెందిన రామ్‌భూపాల్‌రెడ్డికి నగరానికి చెందిన ఫిల్మ్ ఫైనాన్సియర్ మంజులారెడ్డితో పరిచయమైంది. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నా కొన్నాళ్లకు మనస్పర్థలు వచ్చి వేర్వేరుగా ఉన్నారు. ఓ దశలో మంజులారెడ్డిని హతమార్చాలని నిర్ణయించుకున్న రామ్‌భూపాల్‌రెడ్డి తన మిత్రులైన మల్లికార్జునరెడ్డి, మధుసూధన్‌రెడ్డిలతో కలిసి 2006 జూన్ 27న చంపేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి ఖమ్మం సమీపంలోని పాలేరు జలాశయంలో పడేశారు.
ముక్కలుగా దొరికిన రాకేష్
నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో వాచ్‌మన్‌గా పని చేసిన ఓ వ్యక్తి కుమారుడు రాకేష్ 2010 డిసెంబర్‌లో ముక్కలు ముక్కలుగా దొరికాడు. తొలుత రామ్‌కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్ వద్ద కాళ్లు, తల లేని మొండెం, రెండు రోజులకు నారాయణగూడలో కాళ్లు లభించాయి. ఇతడి కుడికాలికి ఉన్న ఆరు వేళ్లను బట్టి తల్లిదండ్రుల తమ బిడ్డగా గుర్తించారు. రాకేష్ తల మాత్రం దొరకలేదు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరనేదీ తేలలేదు.

రిఫ్రిజిరేటర్‌లో విగతజీవిగా..
కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన వస్త్ర వ్యాపారి శ్రీనివాస్ 2011లో హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన దుండగులు ఆయన మృతదేహాన్ని తమ ఫ్లాట్‌లో ఉన్న ఫ్రిజ్‌లో పెట్టి పరారయ్యారు. సిరిసిల్లకే చెందిన ఫ్రొఫెషనల్ నేరగాడు శ్రీధర్ సూత్రధారిగా ఈ హత్య జరిగింది.
డ్రమ్ములో డెడ్‌బాడీ..
వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్ 28న ఓ డెడ్‌బాడీ బయటపడింది. నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్‌లో ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్ చేసి టేప్ వేసిన స్థితిలో లభించింది. వికలాంగుడైన హతుడిది నల్లగొండ, మహబూబ్‌నగర్ అయి ఉండవచ్చని పోలీసులు భావించారు.
ఉడికించి.. పొడిగా చేసి..
రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని మీర్‌పేట పరిధి జిల్లెలగూడలో ఈ ఏడాది జనవరిలో వెంకట మాధవిని ఆమె భర్త గురుమూర్తి చంపేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి క్యా్రస్టిక్ సోడా వేసి ఉడకబెట్టి, ఎముకల్ని పొడిగా చేశాడు. ఆపై డ్రైనేజీలో కలిపేశాడు.
ఆధారాలు మాయం చేయడానికే..
ఇలాంటి ఉదంతాల్లో మృతదేహాలను ముక్కలు చేయడం, కాల్చేయడం, ఉడికించడం.. తదితరాలన్నీ ఎక్కువగా కీలక ఆధారమైన డెడ్‌బాడీని మాయం చేయడానికే చేస్తుంటారు. మృతదేహాన్ని యథాతథంగా తీసుకువెళ్లి ఎక్కడైనా పడేసి వచ్చే అవకాశం లేకపోతేనే ఈ వైపు మొగ్గుతుంటారు. ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో యూట్యూబ్ ఆధారంగానూ ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. కుటుంబీకులు.. అందునా భర్తలు ఇలాంటి దారుణాలు చేయడానికి అనుమానమే ప్రధాన కారణమవుతోంది. సమాజంలో పెరిగిపోయిన యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్టర్ కారణంగానూ విచక్షణ కోల్పోతున్నారు. ఈ నేరం చేసే వరకు ఆ నిందితులు సాధారణ జీవితమే గడుపుతుండటం గమనార్హం. ఇలాంటి కేసుల్లో నేరం నిరూపణ కూడా కష్టసాధ్యం అవుతుంది. – ఆర్. ప్రభాకర్, మాజీ డీఎస్పీ