
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. అదె బిల్డింగ్‌లోనే అద్దెకు ఉంటున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కూకట్‌పల్లిలోని దయార్‌గూడలో 11 ఏళ్ల బాలిక సహస్రిని హత్యోదంతం.. రాష్టవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలిక గొంతుకోసి.. ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. చుట్టుపక్కల ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. చివరకు.. ఇది బయటివారి పని కాదని ఓ నిర్ధారణకు వచ్చారు.
అదే సమయంలో.. హత్య జరిగిన అదే భవనంలో ఉంటున్న ఓ యువకుడు అక్కడక్కడే సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బడికిపోయి ఉన్నా బతికేదేమో!
‘‘బడికి పోయి ఉన్నా బతికేదేమో.. ఏం చేసిందని నా బిడ్డను ఇలా చంపారు. అందుకేనేమో ఆడపిల్లను కనాలంటే భయపడుతున్నారు’’ అంటూ తల్లి రేణుక గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు దయార్‌గూడలో ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణ సనత్‌నగర్‌లోని బైక్ మెకానిక్‌గా పనిచేస్తుండగా తల్లి రేణుక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నది. వీరికి కుమార్తె సహస్రిని (11), కుమారుడు సాద్విన్ (9) ఉన్నారు. ఇద్దరూ వేర్వేరు స్కూళ్లలో చదువుతున్నారు.
సోమవారం ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. సహస్రినికి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో గత నాలుగు రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు సాద్విన్ చదువుతున్న పాఠశాల నుంచి బాబుకు లంచ్ బాక్స్ తేలేదని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. దీంతో తల్లి రేణుక వేరే వారికి ఫోన్ చేసి లంచ్‌బాక్స్ రెడీ చేసి స్కూల్‌కు పంపాలని కుమార్తెకు చెప్పడానికి పంపించింది. అయితే ఇంటి తలుపు మూసి ఉందని, ఎవరూ లేరని తల్లికి చెప్పటంతో ఆమె కృష్ణకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి లంచ్ బాక్స్ ఇచ్చి రమ్మని చెప్పింది. కృష్ణ ఇంటికి వెళ్లి చూడగా కుమార్తె సహస్రిని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో భార్యకు, పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్‌తో వచ్చి పరిసరాలను క్షుణ్ణం పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. సహస్రిని ఎవరితో గొడవలు పెట్టుకోదని, అందరితో కలివిడిగా ఉంటుందని, పాఠశాల దూరంగా ఉండటంతో దగ్గరలో స్నేహితులు కూడా ఎవరూ లేరని తల్లి రేణుక తెలిపింది. నా బిడ్డను ఎందుకు చంపారో..ఏమో అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది.