హైదరాబాద్: ఓ మహిళకు వాట్సాప్‌లో అశ్లీల ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. మార్గదర్శికాలనీ విజయలక్ష్మి అనెక్స్ అపార్టుమెంటులో ఓ మహిళ (41) నివాసముంటోంది. అదే అపార్టుమెంటులో ఉండే నాగిరెడ్డి నాగసుబ్బారెడ్డి (32) కొద్ది రోజులుగా ఆమె ఫోన్‌కు అశ్లీల చిత్రాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మందలించి పంపించారు.
అయితే సుబ్బారెడ్డి బాధితురాలికి ఫోన్ చేసి ఇక ముందు అశ్లీల ఫొటోలు పంపించకుండా ఉండాలంటే తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. మరోసారి బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని వీహెచ్‌పీ నాయకులు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేస్తామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


