
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి.. ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు నిందితులూ జార్ఖండ్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..
కూకట్‌పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో పాటు క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన బాలనగర్ డీసీపీ దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలు ఇతరత్ర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకు వచ్చారు.
రాకేష్,రేణు అగర్వాల్‌కు ఫతేనగర్ లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్‌లోనే మరో అపార్ట్‌మెంట్‌లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్‌కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.
బుధవారం ఉదయం రాకేష్,శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు.రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్‌లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు.
ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్‌ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్‌తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్‌కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్‌కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్‌పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీ జాడ కూడా ఇంకా లభ్యం కాలేదు.

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
కూకట్‌పల్లిలో పనిమనుషుల చేతుల్లో దారుణ హత్యకు రేణు అగర్వాల్ కుటుంబాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. రాకేష్, శుభంలను ఓదార్చారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో ఆయన కేసు స్టేటస్ గురించి ఆరా తీశారు.