
ఐదు నెలల గర్భవతిపై అనుమానంతో భర్త కిరాతకం
మొండెం ఇంట్లో దాచి మిగిలిన భాగాలు మూసీలో పడేసిన వైనం
ఆపై భార్య కనిపించట్లేదంటూ పోలీసు కేసు పెట్టేందుకు ప్రయత్నం
అనుమానంతో ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు.. బండారం బయటపడటంతో అరెస్ట్
‘మీర్‌పేట్’ఉదంతాన్ని మరువక ముందే బోడుప్పల్‌లో అదే తరహా ఘటన
సాక్షి, హైదరాబాద్/మేడిపల్లి/అనంతగిరి: భాగ్యనగరంలో మరోసారి ‘మీర్‌పేట్’తరహా కిరాతకం వెలుగుచూసింది. గతేడాది కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు భార్యపై అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఐదు నెలల గర్భిణి అనే కనికరం కూడా లేకుండా భార్యను పక్కా పథకం ప్రకారం హతమార్చి ఆపై మృతదేహాన్ని హాక్సా బ్లేడ్‌తో ముక్కలు చేసి పలు భాగాలను మూసీలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్లు భార్య కనిపించట్లేదంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్య సమాజ్‌లో కులాంతర వివాహం: మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజారెడ్డి, హతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన సామల మహేందర్‌రెడ్డి (27) అదే గ్రామానికి చెందిన స్వాతి అలియాస్ జ్యోతి (21) ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి గతేడాది జనవరిలో కూకట్‌పల్లిలోని ఆర్య సమాజ్‌లో కులాంతర వివాహం చేసుకున్నారు. ఆపై రాజీపడిన కుటుంబీకులు గ్రామంలో మరోసారి వివాహ తంతు నిర్వహించారు. పెళ్లయ్యాక బోడుప్పల్‌కు వచ్చి శ్రీనివాస్ నగర్‌లో కాపురం పెట్టారు. మహేందర్‌రెడ్డి బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా అతని భార్య పంజగుట్టలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేసేది.
అయితే నెలపాటు సజావుగా సాగిన వారి కాపురంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. భార్యపై అనుమానం పెంచుకున్న మహేందర్‌రెడ్డి పదేపదే సూటిపోటి మాటలతో వేధించడంతో స్వాతి ఉద్యోగం మానేసింది. అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడంతో గతేడాది ఏప్రిల్ 22న భర్తపై వికారాబాద్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే గ్రామ పెద్దలు సైతం భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో గతేడాది జూన్ నుంచి మళ్లీ ఇరువురూ కలిసి గత నెల వరకు వికారాబాద్‌లోనే ఉన్నారు.
దాదాపు 20 రోజుల క్రితం మళ్లీ నగరానికి వచ్చిన ఈ జంట.. శ్రీనివాస్ నగర్‌లోని అదే ఇంట్లో అద్దెకు దిగింది. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన స్వాతి వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 27న వికారాబాద్ వెళ్లి ఆపై పుట్టింటికి వెళ్లి ఉంటానని భర్తకు చెప్పింది. దీనికి మహేందర్ అంగీకరించకపోవడంతో ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. అప్పటికే ఆమెపై కక్ష పెంచుకున్న మహేందర్‌రెడ్డి ఈ పరిణామంతో భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన పథకాన్ని అమలు చేయడం కోసం బోడుప్పల్‌లోని ఓ హార్డ్‌వేర్ షాపు నుంచి హాక్సా బ్లేడ్ కొని ఇంట్లో దాచాడు.
గొంతు నులిమి చంపి, ముక్కలు చేసి...
శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేందర్‌రెడ్డి.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చి భార్యతో మరోసారి గొడవపడి ఆపై గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి హాక్సా బ్లేడ్‌తో కాళ్లు, చేతులు, తలను మొండెం నుంచి వేరు చేశాడు. మొండాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి గదిలోనే దాచి మిగిలిన శరీర భాగాలను మరో కవర్‌తోపాటు బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకున్నాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై బయలుదేరి ప్రతాప్‌సింగారం ప్రాంతంలోని మూసీ వంతెన పైనుంచి వాటిని నదిలో పడేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆపై తన సోదరికి ఫోన్ చేసి భార్య కనిపించట్లేదని.. ఉప్పల్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.
అనుమానించిన మేడిపల్లి పోలీసులు...
ఉప్పల్ ఠాణాకు వెళ్లిన మహేందర్‌రెడ్డి తాము ఉంటున్న ప్రాంతంలో ఆ పోలీసుస్టేషన్ పరిధిలోకి రాదని తెలిసి వెనక్కు వచ్చాడు. అదే సమయానికి అతడి సోదరి సమీప బంధువుకు సమాచారం ఇచ్చింది. అప్పటికే కుటుంబ కలహాలు, రాజీలు ఉండటంతో ఆందోళన చెందిన ఆయన.. మహేందర్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే అతన్ని లోపలకు రానివ్వని మహేందర్‌రెడ్డి.. మేడిపల్లి ఠాణాకు వెళ్లి మిస్సింగ్ కంప్లయింట్ ఇద్దామంటూ తీసుకువెళ్లాడు.
వారి నుంచి ఫిర్యాదు స్వీకరించే క్రమంలో మేడిపల్లి పోలీసులు మహేందర్‌రెడ్డి, స్వాతి పూర్వాపరాలు అడిగారు. అవి తెలియడంతో అతనిపై అనుమానం వచ్చి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ నగర్‌లోని ఇంటికి తీసుకువచ్చారు. తాళం తీయించి లోపలకు వెళ్లగా గదిలోని కవర్‌లో ఉన్న మొండెం కనిపించడంతో కంగుతిన్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే హత్యానంతరం శరీర భాగాలను మూసీలో పడేసినట్లు నిందితుడు చెప్పడంతో అతన్ని మూసీ వద్దకు తీసుకెళ్లి అవశేషాల కోసం గాలించారు. ఇటీవలి భారీ వర్షాల ప్రభావంతో మూసీ ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులకు అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. మహేందర్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. దీన్నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించి స్వాతి తల్లితో పోల్చి చూడాలని నిర్ణయించారు.
తిండి కూడా పెట్టేవాడు కాదన్న తల్లి...
గర్భవతి అయిన భార్య వివరాలు చెబితే నమోదు చేసుకుంటామని స్థానిక ఆశావర్కర్లు గతంలో పలుమార్లు అడిగినా మహేందర్‌రెడ్డి స్పందించలేదని తెలిసింది. కడుపుతో ఉన్న తన బిడ్డకు అల్లుడు అన్నం కూడా పెట్టేవాడు కాదని... తిండి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని కుమార్తె పలుమార్లు చెప్పుకొని బాధపడిందని స్వాతి తల్లి స్వరూప విలపిస్తూ చెప్పింది. పెళ్లయిన రెండు నెలలకే స్వాతి గర్భం దాల్చగా మహేందర్‌రెడ్డి బలవంతంగా అబార్షన్ చేయించినట్లు మృతురాలి కుటుంబీకులు పేర్కొన్నారు.
ఈ విషయమై నిలదీసేందుకు మీ తల్లిదండ్రులు మా ఇంటికి వెళ్తే అంతుజూస్తానంటూ మహేందర్‌రెడ్డి పలుమార్లు స్వాతిని హెచ్చరించాడని సమాచారం. కాగా, వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే నివసించే మహేందర్‌రెడ్డి తల్లిదండ్రులు సోమిరెడ్డి, భారతమ్మ కుమారుడు చేసిన దురాగతం నేపథ్యంలో ఇంటికి తాళం వేసి పారిపోయారు.