
సాక్షి, హైదరాబాద్: తమకు న్యాయం చేయాలంటూ సహస్ర తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో చేయడానికి సహస్ర తల్లిదండ్రులు ప్రయత్నించారు. పోలీసులు నచ్చజెప్పారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూకట్‌పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్‌పల్లి నుంచి ఎర్రగడ్డ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

తమకు న్యాయం చేయకపోతే సూసైడ్ చేసుకుంటామంటూ సహస్ర తల్లి హెచ్చరించారు. న్యాయం చేసేవరుకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని.. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా? తమ కుమార్తె హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని సహస్ర తల్లి ఆరోపిస్తోంది.
బాలిక సహస్ర తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదని.. అతడికి ఉరిశిక్ష వేస్తేనే తన కూతురికి ఆత్మ శాంతి కలుగుతుందన్నారు. తన కూతురిని హత్య చేసి పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడన్నారు. ‘‘నా కూతురిని చంపేసి.. నా కొడుకును ఓదార్చుతున్నాడు. ఇతనే చంపాడని నేను కూడా నమ్మలేదు. అసలు ఈ భూమి మీద అతడు ఉండకూడదు. కఠిన శిక్ష విధించాలి’’ అని సహస్ర తండ్రి డిమాండ్ చేశారు.

సహస్ర హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. బ్యాట్ కోసం ఇదంతా జరిగినట్టు తేలిందన్నారు.
కూకట్‌పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మహంతి మాట్లాడుతూ..‘ఈనెల 18వ తేదీన బాలిక హత్య జరిగింది. మూడు రోజుల వరకు సరైన క్లూ దొరకలేదు. శుక్రవారం బాలుడిని పట్టుకున్నాం. పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడే సహస్రను హత్య చేశాడు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసింది.

వెంటనే దొంగ దొంగ అని అరిచింది. దీంతో, సహస్రను బెడ్‌రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశారు. బాలికను తోసేసి కళ్లు మూసుకుని కత్తితో పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేరు అనుకుని దొంగతనానికి వెళ్లాడు.. కానీ, బాలిక ఉండేసరికి ఆమెపై దాడి చేశాడు. ఈ కేసులో బాలుడిని ప్రశ్నిస్తే విచారణను తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నాం. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయి.
