వాట్సాప్‌ డిస్‌ప్లే పిక్చర్లుగా అధికారుల ఫోటోలు...అమెజాన్‌ గిఫ్ట్‌ కూపన్ల పేరుతో వల | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ డిస్‌ప్లే పిక్చర్లుగా అధికారుల ఫోటోలు...అమెజాన్‌ గిఫ్ట్‌ కూపన్ల పేరుతో వల

Published Wed, Jun 29 2022 7:12 AM

Fraudulent Nigerians Sending Messages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల ఫొటోలను వాట్సాప్‌ డిస్‌ప్లే పిక్చర్లుగా (డీపీ) పెట్టి, అనేక మందికి సందేశాలు పంపిస్తూ, అమెజాన్‌ గిఫ్ట్‌ కూపన్లు కోరి టోకరా వేస్తున్న, వేయడానికి ప్రయత్నిస్తున్న కేటుగాళ్లు నైజీరియాలో ఉన్నట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ సహా ముగ్గురు ఉన్నతాధికారుల ఫొటోల దుర్వినియోగంపై నమోదైన కేసుల దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు ఆయా వాట్సాప్‌ల ఐపీ అడ్రస్‌లు తని ఖీ చేయగా అవన్నీ నైజీరియాలోనే ఉన్నట్లు తేలింది. 

ఇక్కడి నంబర్‌ అక్కడ వాట్సాప్‌.. 
దేశంలోనే ఉంటూ నేరాలు చేసే నైజీరియన్లు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని వాడుతుంటారు. వీళ్లు బాధితులను బుట్టలో వేసుకోవడానికి అవసరమైన ఫోన్లు చేయడానికి బోగస్‌ వివరాలతో సిమ్‌కార్డులు తీసుకుంటారు. వీటిని వీళ్లు కేవలం బేసిక్‌ ఫోన్లలో వేసి వాడేలా సూత్రధారులైన నైజీరియన్లు జాగ్రత్తపడతారు. ఈ నంబర్లకు సంబంధించిన వాట్సాప్‌ను మాత్రం నైజీరియాలోని తమ అనుచరులతో యాక్టివేట్‌ చేయిస్తారు. అక్కడి వాళ్లు వైఫై ద్వారా వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకుంటారు. అందుకు అవసరమైన కోడ్‌ మాత్రం ఇక్కడి వ్యక్తి దగ్గర ఉన్న నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ రూపంలో వస్తుంది. దీన్ని వీళ్లు నైజీరియాలోని వారికి చెప్పడంతో వాళ్లు ఎంటర్‌ చేసుకుని వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకుంటున్నారు.  

చిక్కకుండా గిఫ్ట్‌ కూపన్లు.. 
గతంలో సైబర్‌ నేరగాళ్లు తమ సందేశాలు అందుకున్న వారి నుంచి డబ్బు అడిగి ఆన్‌లైన్‌ ద్వారా లేదా వివిధ వ్యాలెట్స్‌కు పంపాలని కోరేవారు. విషయం పోలీసుల వరకు వెళ్లి దర్యాప్తు చేపడితే నగదు చేరిన నంబర్‌ ఆధారంగా వీరి వివరాలు బయటపడేవి. ఇటీవల కాలంలో ఎక్కువగా అమెజాన్‌ గిఫ్ట్‌ కూపన్లు పంపాలని కోరుతున్నారు. నిర్ణీత మొత్తానికి వీటికి ఖరీదు చేస్తున్న బాధితులు దానికి సంబంధించిన లింకులను షేర్‌ చేస్తున్నారు. వీటిని ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా రీడీమ్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఫలానా దేశంలో కూపన్‌ రీడీమ్‌ అయిందని గుర్తించినా చర్యలు సాధ్యంకాదు.  

అధికారిక వెబ్‌సైట్లే ఆధారం.. 
వాట్సాప్‌ సిద్ధం చేసుకుంటున్న నైజీరియన్లు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే ప్రముఖ సంస్థల, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల వివరాలు, ఫొటోలు సంగ్రహిస్తున్నారు. ప్రొఫైల్‌ నేమ్, అబౌట్‌ తదితరాలను డీపీగా ఎంచుకున్న ఫొటోకు తగ్గట్టే సిద్ధం చేసుకుంటారు. ఈ నంబర్‌ నుంచి సదరు అధికారి కింద పని చేసే వారికి సందేశాలు పంపుతారు. ఇవీ నేరగాళ్ల చేతికి ఆయా వెబ్‌సైట్ల ద్వారానే తెలుస్తున్నాయి. కేవలం డీపీలు మాత్రమే చూస్తూ ఆ సందేశం తమ అధికారి నుంచే వచ్చినట్లు భావించి స్పందిస్తున్నారు. ఈ తరహా స్కామ్స్‌ దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.  

సంప్రదించి సరిచూసుకోవాలి 
డీపీ ఫ్రాడ్స్‌ల్లో ఉన్నతాధికారులు, సెలబ్రెటీల ఫొటోలు వినియోగిస్తారు. ఎవరికైనా తమ పై అధికారులు, పరిచయస్తుల నుంచి డబ్బు, గిఫ్ట్‌ కూపన్లు పంపాలంటూ సందేశాలు వస్తే గుడ్డిగా నమ్మొద్దు. కేవలం డీపీలు చూసి ఆ సందేశం ఫలానా వారే పంపారని భావించద్దు. ఆ వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్‌ నంబర్‌ను పరిశీలించాలి. అది వాళ్లు నిత్యం వినియోగించేది కాకపోతే వ్యక్తిగతంగా లేదా ఫోన్‌ ద్వారా సంప్రదించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. 
– కేవీఎం ప్రసాద్, హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ   

(చదవండి: ఫారిన్‌ ట్రేడింగ్‌ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం)

Advertisement
 
Advertisement
 
Advertisement