ఎంపీ కేశినేని చిన్ని భారీ భూ దోపిడీ! | Former MP Kesineni Nani complaint to CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఎంపీ కేశినేని చిన్ని భారీ భూ దోపిడీ!

Jun 29 2026 4:22 AM | Updated on Jun 29 2026 4:22 AM

Former MP Kesineni Nani complaint to CM Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు

హైదరాబాద్‌లో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు 

సుప్రీంకోర్టును బురిడీ కొట్టించి 112 ఎకరాల స్థలం కబ్జాకు యత్నం..  ఈ సిండికేట్‌ భూకబ్జాలే కాదు.. 

పలు నకిలీ ప్రీలాంచ్‌ స్కామ్‌లకు పాల్పడిందన్న నాని

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) హైదరాబాద్‌లో భారీ భూదోపిడీకి తెర లేపారని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) ఆరోపించారు. కూకట్‌పల్లి సమీపంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఈ భూకబ్జాను అడ్డుకుని, క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
 
పదవిని దుర్వినియోగం చేస్తున్నారు.. 
‘మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండల పరిధిలోని షంషీగూడ గ్రామ సర్వే నంబర్‌ 57లో ఉన్న 112.72 ఎకరాల విలువైన భూమిని అక్రమంగా చేజిక్కించుకోవడానికి కేశినేని చిన్ని ఒక పెద్ద సిండికేట్‌ను నడుపుతున్నారు. టీజీఐఐసీ ఐటీ పార్క్‌ కోసం ప్రతిపాదించిన ఈ ప్రభుత్వ భూమిని కాజేయడానికి ఎంపీ తన కుమారుడు కేశినేని వెంకట్‌ చౌదరిని (ఎక్సెల్లా ప్రాపరీ్టస్‌ మేనేజింగ్‌ పార్టనర్‌) ప్రాక్సీగా వాడుకుంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్తులను చేజిక్కించుకోవడానికి ఢిల్లీ నుండి తన రాజ్యాంగ పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భూమిపై అక్రమంగా హక్కులు పొందడానికి నాగమ్మ గుడి ఎదురుగా భారీ ఎర్త్‌ మూవర్లను, బారికేడ్లను మోహరించారు..’అని నాని తన లేఖలో తెలిపారు. 

కోర్టును మోసం చేస్తున్నారు.. 
‘ఈ భూమిపై ఎలాంటి ప్రైవేట్‌ యాజమాన్య హక్కులు లేవని 2026 మార్చి 19 నాటి కౌంటర్‌ అఫిడవిట్‌లో జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎంపీ సిండికేట్‌ సుప్రీంకోర్టులో ఆర్టికల్‌ 142 కింద మోసపూరిత ప్రైవేట్‌ రాజీ దరఖాస్తులను దాఖలు చేసింది. సర్వే నంబర్‌ 57లోని మొత్తం 274.33 ఎకరాలు (కబ్జాకు ప్లాన్‌ చేసిన 112.72 ఎకరాలతో కలిపి) ’పోరంబోకు సర్కారీ’ భూమిగా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. పైగా అస్మాన్‌ జాహి వారసుల ప్రైవేట్‌ క్లెయిమ్‌లను అతియాత్‌ కోర్టు (25.11.1957న), రెవెన్యూ బోర్డు (06.05.1976న) తిరస్కరించాయి. 1959 నాటి ప్రాథమిక రాజీ డిక్రీ (దీనిలో ప్రభుత్వం భాగస్వామి కాదు) కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతిపై ఆధారపడి ఉంది. కానీ అది ఎప్పుడూ జరగలేదు. అంతేకాకుండా ఈ ఆస్తి వెనుక పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ కుంభకోణానికి సంబంధించిన నిధుల మళ్లింపు ఉందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతంలోనే కాషన్‌ నోటీసు ఇచ్చింది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) స్టే ఆర్డర్‌ కూడా ఉంది. ఈ విషయాలన్నింటినీ దాచిపెట్టి కోర్టును సైతం మోసం చేస్తున్నారు. ప్రైవేట్‌ రాజీ ద్వారా వీటిని దాటవేయడం పీఎంఎల్‌ఏ (మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం)లోని తీవ్రమైన నేరాలు, క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ (నమ్మకద్రోహం) కిందకు వస్తుంది..’అని నాని పేర్కొన్నారు.  

నకిలీ ప్రీ–లాంచ్‌ స్కామ్‌లు 
‘ఈ సిండికేట్‌ కేవలం భూకబ్జాలకే పరిమితం కాకుండా టీఎస్‌–రెరా అనుమతులు లేకుండా కేశినేని డెవలపర్స్, ఎక్సెల్లా ప్రాపర్టీస్‌ పేరుతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12, గచ్చిబౌలి, ప్రగతినగర్, శంకర్‌పల్లి, పటాన్‌చెరు, దుండిగల్‌ వంటి ప్రాంతాలలో నకిలీ ప్రీ–లాంచ్‌ స్కామ్‌లకు పాల్పడింది. ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. లేని ప్లాట్లను చూపిస్తూ వందలాది మధ్యతరగతి కుటుంబాల నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ నిధులను భూకబ్జా కార్యకలాపాలకు మళ్లించారు..’అని కేశినేని నాని ఆరోపించారు.  

ఖాతాలను ఫ్రీజ్‌ చేయండి.. 
‘తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను, సామాన్య పౌరుల కష్టార్జితాన్ని కాపాడటానికి సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టులో ఎంపీ సిండికేట్‌ వేసిన ప్రైవేట్‌ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేలా చర్యలకు అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించాలి. వివాదాస్పద 112.72 ఎకరాల భూమిని తక్షణమే హైడ్రా ఆధీనంలోకి తీసుకుని, అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన కుమారుడు వెంకట్‌ చౌదరి, ఇతరులపై క్రిమినల్‌ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలి. సీఐడీ ఎకనమిక్‌ అఫెన్స్‌ వింగ్, టీఎస్‌–రెరా ద్వారా సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు న్యాయం జరిగేలా సదరు కంపెనీలు, నిందితుల బ్యాంక్‌ ఖాతాలను తక్షణమే స్తంభింపజేయాలి..’అని నాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను హైడ్రా కమిషనర్, టీజీఐఐసీ ఎండీ, తెలంగాణ డీజీపీ, రెరా చైర్మన్‌లకు కూడా తదుపరి చర్యల కోసం పంపినట్లు నాని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement