
నారాయణపూర్, తుంగభద్ర డ్యాంల దిగువన కృష్ణా బేసిన్‌లో విస్తారంగా వర్షాలు
ఉప నదులైన మూసీ, హంద్రీ, బీమా,తుంగభద్ర ఉధృతితో కృష్ణాకు పెరిగిన వరద
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,18,650 క్యూసెక్కులు, సాగర్ నుంచి 6.25 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు
మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, ప్రధాన పాయతో గోదావరికి పోటెత్తిన వరద
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్/బోధన్/బాల్కొండ/కాళేశ్వరం/దోమలపెంట/ధరూర్: నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఉపనదులు ఉప్పొంగి కృష్ణమ్మ మహోగ్రరూపం..గోదావరి ఉగ్రరూపం దాచ్చాయి. ప్రధానంగా నారాయణపూర్, తుంగభద్ర డ్యాం దిగువన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా ఉపనదులు మూసీ, హంద్రీ, తుంగభద్ర, బీమా వరదెత్తుతున్నాయి. దీనికి ప్రధాన పాయ నుంచి వస్తున్న వరద తోడుకాగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకు జూరాల ప్రాజెక్టులోకి 5.10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా గేట్లన్నీ ఎత్తేసి 5.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
తుంగభద్ర, సుంకేశుల బరాజ్‌ల నుంచి తుంగభద్ర ద్వారా 79,268 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 27 వేల క్యూసెక్కులు కృష్ణా ప్రధాన పాయలోకి చేరుతున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,93,680 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 5,18,650 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి 6,25,511 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా, 26 గేట్లు ఎత్తి అంతే పరిమాణంలో దిగువకు వదిలేస్తున్నారు.
» హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీనది కూడా మహోగ్రరూపం దాల్చింది. కృష్ణా వరదకు మూసీ ఉధృతి తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 6,86,906 క్యూసెక్కుల నీరు చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 6.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. దీంతో 6,39,737 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు.
శ్రీరాంసాగర్ నుంచి ధవళేశ్వరం వరకూ
గోదావరి ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి వరదెత్తుతున్నాయి. తెలంగాణలో మంజీరపై నిర్మించిన నిజాంసాగర్ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదలేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఎగువ నుంచి కూడా వరద వస్తుండంతో 19 గేట్లు ఎత్తి 4.59 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5.72 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 6.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీనికి ప్రాణహిత, ఇంద్రావతి వరద తోడవుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోకి 8.03 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.
దాని దిగువన ఉన్న సీతమ్మ సాగర్‌లోకి 8.94 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు శబరి ప్రవాహం తోడవుతుండటంతో పోలవరం ప్రాజెక్టులోకి 10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బరాజ్‌లోకి భారీ వరద రాగా, 10,09,208 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు.
అంత్రరాష్ట్ర రవాణా నిలిపివేత
బోధన్ మండలంలోని ఖండ్‌గాం వద్ద మంజీర వంతెన మీదుగా మహారాష్ట్ర ప్రాంతానికి రవాణాను నిలిపివేశారు. కందకుర్తి వద్ద గోదావరి నది వంతెన మీదుగా వరద నీరు ప్రవహించడంతో కందకుర్తి – ధర్మాబాద్ (మహారాష్ట్ర) మధ్య రవాణాను అధికారులు నిలిపివేశారు.
» గోదావరి నదిలో పెరుగుతున్న వరద ఉధృతికి నిజామాబాద్–పండరీపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు ఆదివారం తాత్కాలికంగా రద్దు చేశారు. నవీపేట మండలంలోని యంచ శివారులో గల గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జికి మూడడుగుల వ్యత్యాసంలో నది ప్రవహిస్తోంది.
ఏడుపాయలను ముంచెత్తిన వరద
పాపన్నపేట(మెదక్): మంజీరా జోరు పెరిగింది. వరద ఉధృతికి ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల నీరు దిగువకు పయనిస్తోంది. దీంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఎదుట గల క్యూలైన్లు, షెడ్డు రేకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆలయాన్ని ముంచెత్తుతూ సమీపంలో గల యాగశాల నుంచి వరద పోటెత్తుతోంది.