ఖమ్మంరూరల్: ఓ విద్యార్థిని మరణం ఆమె కుటుంబాన్నే కాదు... ఆ వీధి, పాఠశాల, స్థానికులను శోకసంద్రంలో ముంచెత్తింది. 14ఏళ్ల క్రితం ఒక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ఇంకొకరికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ విధి చిన్నచూపు చూడడంతో ఇంకో కుమార్తె కూడా మృత్యువాత పడింది. ఇందుకు సంబంధించి వివరాలు.. ఏదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన రంగిశెట్టి ఉదయ్ – స్రవంతి దంపతులకు 14 ఏళ్ల క్రితం కవల కుమార్తెలు జన్మించారు.
ఇందులో ఓ కుమార్తె పసిప్రాయంలోనే పేగు సంబంధిత సమస్యతో మృతి చెందింది. అదే సమస్యతో బాధపడుతున్న ఇంకో కుమార్తె వైదికకు తల్లిదండ్రులు చికిత్స చేయిస్తూ ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడారు. కానీ విధి మరోసారి అదే కుటుంబాన్ని పరీక్షించింది. హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తుండగా వైదిక పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు స్థానికులందరినీ కంట తడి పెట్టించింది.
చివరిచూపు కోసం...
ఏదులాపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో వైదిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె స్నేహితులతోనే కాక స్థానికులతో కలివిడిగా ఉండేది. ఆమె మృతి చెందిన సమాచారం తెలియగానే స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాక వైదిక అంతిమయాత్ర పాఠశాల సమీపం నుంచి వెళ్తుండగా వీడ్కోలు పలికారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.


