ఖాజీ.. కాసులకు రాజీ! | Fake marriages to claim Shaadi Mubarak funds | Sakshi
Sakshi News home page

ఖాజీ.. కాసులకు రాజీ!

Jun 25 2026 1:24 AM | Updated on Jun 25 2026 1:24 AM

Fake marriages to claim Shaadi Mubarak funds

షాదీ ముబారక్‌ నిధుల కోసం దొంగ పెళ్లిళ్లు  

యువతులకు సమాచారం లేకుండానే ‘ఖులా’ పత్రాల జారీ  

చట్టాలు, వక్ఫ్‌ బోర్డు నిబంధనలను తుంగలోకి తొక్కికాసుల కోసం కొందరు ఖాజీల కక్కుర్తి 

మండిపడుతున్న మత గురువులు..వక్ఫ్‌బోర్డు మౌనం 

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: ఖాజీల ప్రతినిధి ఇక్రాముల్లా

చాంద్రాయణగుట్టలో ఓ ఖాజీ మధ్యవర్తితో కలిసి మూడు నెలల్లో 11 దొంగ పెళ్లిళ్లు చేశాడు. అప్పటికే వివాహితుడైన 35 ఏళ్ల వ్యక్తికి, 19 ఏళ్ల యువతికి బలవంతంగా నిఖా చేసి షాదీ ముబారక్‌కు దరఖాస్తు చేయించాడు. ఈ సొమ్మును ఖాజీ, మధ్యవర్తి పంచుకున్నారు. ఆ తర్వాత బాధిత యువతి ఫిర్యాదుతో బాగోతం బయటపడింది. 

బహదూర్‌పురాలో ఓ ఖాజీ ఒకే రోజు అక్కాచెల్లెళ్లకు ఒకే వ్యక్తితో నిఖా చేశాడు. ఇద్దరి పేరున నిధులు మంజూరయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: ముస్లిం వివాహ వ్యవస్థకు మూల స్తంభాలైన ఖాజీలలో కొందరు.. నేడు ఆ వ్యవస్థకే గొడ్డలిపెట్టుగా మారుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. షాదీ ముబారక్‌ కింద పేద ముస్లిం యువతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.1,00,116 సాయం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇష్టమొచి్చనట్టుగా నిఖాలు చేసేస్తుండటం, కొన్ని వివాహాలపై సందేçహాలు తలెత్తడంతో మైనార్టీ సంక్షేమ శాఖ విచారణ జరిపింది. 2024–25లో హైదరాబాద్‌లో ఈ తరహాలో 212 అనుమానాస్పద పెళ్లిళ్లు జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు గుర్తింపు పొందిన ఖాజీలు 387 మంది ఉన్నారు.

‘తెలంగాణ ముస్లిం ఖాజీల చట్టం–2016’ప్రకారం వివాహానికి వధూవరులకు తగిన వయసు, అంగీకారం, సాక్షులు తప్పనిసరి. కానీ 65 శాతం నిఖాల్లో ఈ నియమాలు పాటించకుండానే కొందరు కార్యక్రమం ముగించేస్తున్నారు. వక్ఫ్‌ బోర్డు నిఖాకు రూ.2,500 ఫీజు నిర్ణయిస్తే, అక్రమ పెళ్లిళ్లకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి భర్త నుంచి విడిపోవడానికి ముస్లిం మహిళ ‘ఖులా’తీసుకోవాలి.

కానీ భార్య సంతకం/సమ్మతి లేకుండా, ఆమెకు తెలియకుండానే ఆమె పేరిట కొందరు ఖాజీలు ఖులా పత్రాలు ఇచ్చేస్తున్నారు. మలక్‌పేట్‌కు చెందిన సల్మాకు తెలియకుండానే భర్త రూ.30 వేలు ఇచ్చి ఖులా చేయించుకున్నాడు. మూడు నెలల తర్వాత నోటీసు వస్తేగానీ ఆమెకు తెలియలేదు. 2024–25లో నగరంలో ఇలాంటి ఫిర్యాదులు 34 వచ్చాయి.  

నాయబ్‌ ఖాజీల అక్రమ దందా  
కొందరు గుర్తింపు పొందిన ఖాజీలు నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో నాయబ్‌ ఖాజీలను(డిప్యూటీ) నియమించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా అనధికార నాయబ్‌ ఖాజీలు ఉన్నట్టు సమాచారం. కాగా వీరు కూడా నిఖాలు జరిపించేస్తున్నారు. వాస్తవానికి వీరికి ఎలాంటి అధికారిక అనుమతి లేదు. రికార్డులు ఉండవు. కానీ ఒక్కో నిఖాకు రూ.5 వేలు వసూలు చేస్తూ పెళ్లిళ్లు చేస్తున్నారు. గత రెండేళ్లలో వక్ఫ్‌బోర్డుకు 180కి పైగా ఫిర్యాదులు వచ్చినా చర్యలు నలుగురిపైనే చర్యలు తీసుకున్నారు. సిబ్బంది లేరనే కారణంతో వక్ఫ్‌బోర్డు ఖాజీల విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తోంది. 

నిఖా, ఖులాను ఆధార్‌తో అనుసంధానించాలి 
    ‘ఖాజీ పదవి న్యాయం కోసం.. కాసుల కోసం కాదు’అని మత గురువులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ‘ఖాజీ నియంత్రణ ప్రాధికార సంస్థ’ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి నిఖా, ఖులాను ఆధార్‌తో అనుసంధానించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే ఈ దందాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఖాజీ వ్యవస్థకు చెడ్డపేరు 
నిఖా అనేది షరియత్‌ ప్రకారం పవిత్రమైన బంధం, కాసుల కోసం దానిని అమ్ముకోవడం నిషిద్ధం. కొందరు చేసే తప్పుల వల్ల మొత్తం ఖాజీ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. చట్టబద్ధంగా, పారదర్శకంగా నిఖా, ఖులా నిర్వహించడమే మా బాధ్యత. ప్రభుత్వ పథకాల కోసం బూటకపు పెళ్లిళ్లు చేస్తూ, ఫేక్‌ సర్టీఫికెట్లు ఇచ్చే ఖాజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. షాదీముబారక్‌ సొమ్ము కోసం దొంగ పెళ్లిళ్లు చేసిన వారిని, సహకరించిన మధ్యవర్తులను శిక్షించాలి. 
– ఖాజీ ఇక్రాముల్లా, నాజిరుల్‌ ఖజాత్‌ (రాష్ట్ర ఖాజీల ప్రతినిధి) (ఫొటో కామన్‌లో ఖాజీ పేరుతో ఉంది)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement