తెలంగాణ టు యూఎస్‌

Exports From Telangana Are Mostly To America - Sakshi

రాష్ట్రం నుంచి ఎగుమతులు ఎక్కువగా అమెరికాకే..  

మొత్తం ఎగుమతుల్లో 28 శాతం అక్కడికే.. 

ఫార్మా ఉత్పత్తులే ఎక్కువగా ఎగుమతి

2021–22లో రూ.2.65 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు 

ఎక్స్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో రాష్ట్రానికి 5వ స్థానం 

సాక్షి, హైదరాబాద్‌: మన రాష్ట్రం నుంచి ఎగుమతులు ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకే జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ నుంచి ఎగుమతులు జరుగుతున్న టాప్‌ 10 దేశాల్లో అమెరికా, చైనా, సింగపూర్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఇటీవలే భూకంపం సంభవించి అల్లాడిపోతున్న తుర్కియే కూడా ఉండడం గమనార్హం. 

అయితే మొత్తం ఎగుమతుల్లో 28.13 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకే వెళుతున్నాయని తాజా సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడయింది. అన్నింటికంటే ఎక్కువగా ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ఎగుమతుల్లో ఫార్మా రంగం వాటా 33.9 శాతం కాగా, ఆ తర్వాతి స్థానంలో ఆర్గానిక్‌ కెమికల్స్‌ (23.41 శాతం) ఉన్నాయి. ఇక, వ్యవసాయ ఉత్పత్తులైన పత్తి కూడా మన రాష్ట్రం నుంచి ఎగుమతుల జాబితాలో చోటు సాధించింది.

మొత్తం ఎగుమతుల్లో పత్తి 3.72, కాఫీ, టీ ఉత్పత్తులు 2.36, ధాన్యాలు 1.81 శాతం ఉన్నాయి. ఇక ఒకప్పుడు ముత్యాల నగరంగా హైదరాబాద్‌ ప్రసిద్ధిగాంచగా, ముత్యాలు, ఇతర విలువైన వస్తువులు కూడా మన రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. మొత్తం ఉత్పత్తుల్లో ముత్యాల ఎగుమతి 2.07 శాతంగా నమోదయింది. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021–22 ఎక్స్‌పోర్ట్స్‌ ఇండెక్స్‌లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఎగుమతుల 
ప్రోత్సాహక విధానాల రూపకల్పనలో మాత్రం 12వ స్థానంలో నిలిచింది. 

జీఎస్‌డీపీలో 7 శాతంగా సరుకుల ఎగుమతుల విలువ 
ప్రభుత్వ లెక్కల ప్రకారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.2,65,510 కోట్ల విలువైన ఎగుమతులు రాష్ట్రం నుంచి జరిగాయి. ఇందులో సర్వీసెస్‌ రంగం నుంచి అత్యధికంగా 69.13 శాతం ఎగుమతి కాగా, సరుకుల ఎగుమతులు 30.87 శాతం మాత్రమే. కానీ ఒక్క సరుకుల ఎగుమతుల విలువ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 7.10 శాతంగా నమోదు కావడం గమనార్హం. సరుకుల ఎగుమతుల్లో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం సరుకుల ఎగుమతుల్లో 85 శాతం వరకు కేవలం 5 జిల్లాల నుంచే జరుగుతున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top