
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21) తన స్నేహితులు కళాశాలలో, హాస్టల్‌లో మానసికంగా వేధించారని, క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిత్య హైదరాబాద్‌లోని రిషి ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదివే వైష్ణవి, సంజన కొద్ది రోజులుగా చదువులో వెనుకబడ్డావని, హేళన చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు.
మనస్తాపానికి గురై ఈనెల 1న ఇంటికి వచ్చింది. 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుల సూచనతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తండ్రి కాటిపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.