
అబూజ్‌మఢ్ ఎన్‌కౌంటర్ మృతుల్లో 14 మంది మహిళలు, 13 మంది పురుషులు
వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురి మృతి
ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశాన్ని 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు విముక్తి ప్రాంతంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంతకుముందే మావోయిస్టుల నిర్మూలన జరిగే అవకాశం ఉందని ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్ అన్నారు. అబూజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించడంతో దేశానికి మంచిరోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు.
మావోయిస్టుల కారణంగా ఎంతోమంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారని అన్నారు. నంబాల మృతదేహంతో పాటు ఎన్‌కౌంటర్‌లో మరణించిన మొత్తం 27 మంది మృతదేహాలను గురువారం నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తీసుకొ చ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన డీజీపీ ఎన్‌కౌంటర్ జరిగిన తీరుతెన్నుల గురించి స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మావోయిస్టులకు భారీ నష్టం
కేంద్ర కమిటీకి చెందిన అగ్రనాయకులు ఉన్నారనే పక్కా సమాచారంతో మే 19 నుంచి ఆపరేషన్ చేపట్టామని డీజీపీ చెప్పారు. నంబాల వంటి అగ్రనేత మృతి మావోయిస్టు పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ఇదో గొప్పరోజని వ్యాఖ్యానించారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మరణించాడని, మరికొందరు గాయపడినా ప్రాణాపాయం లేదని తెలిపారు. మరికొందరు మావోయిస్టులు కూడా తీవ్రంగా గాయçపడి తప్పించుకున్నారని, వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు.
మృతుల్లో కాయ్ –7కి చెందినవారే ఎక్కువ
ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది చనిపోగా అందులో 13 మంది పురుషులు 14 మంది మహిళలు ఉన్నారు. మృతుల్లో నంబాల కేశవరావుతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, జంగ్ పత్రిక నిర్వాహకుడు, సెంట్రల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో స్టాఫ్‌గా ఉన్న నవీన్ అలియాస్ మధు అలియాస్ పజ్జా వెంకట నాగేశ్వరరావు, సీవైపీసీ కమాండర్ రోషన్ అలియాస్ టిప్పు ఉన్నారు. కేశవరావు, మధు, టిప్పును మినహాయిస్తే మిగిలిన వారంతా సుప్రీం కమాండర్‌కు రక్షణ కల్పించే దళమైన కాయ్ –7కి చెందినవారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల్లో నంబాల కేశవరావు, జంగు నవీన్ అలియాస్ మ«ధు, రోషన్ అలియాస్ టిప్పు (సీవైపీసీ ఇన్‌చార్జ్/కమాండర్) కీలక నేతలుగా ఉన్నారు.
వీరితో పాటు నంబాలకు రక్షణ కల్పించే కాయ్–7 కంపెనీకి చెందిన సునీల్, కుర్సం విజా, రవి, సూర్య అలియాస్ సంతు, తెల్లం రాజేశ్, గుడ్డు అలియాస్ ఉంగా, ఓయం రాజు, కోసా హోడి, వివేక్ అలియాస్ ఉగేంద్ర, ఓది భద్రు, బుచ్చి అలియాస్ రామే, భీమే ఆలియాస్ మడావి, భూమిక, లక్ష్మీ అలియాస్ కమ్ల, పొడియం జమున, గీతా, సోమ్లీ అలియాస్ సజ్జంతి, రేష్మా పొడియం, రాగో, సంగీత, సరిత అలియాస్ మాంకో, హిడిమే, అవలం కల్పన, మడావి క్రాంతి మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. నంబాలతో పాటు నవీన్ ఏపీకి చెందిన వారు కాగా వివేక్ (30)తో పాటు భూమిక, సంగీత తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు.
కేశవరావు మృతదేహం హెలికాప్టర్ ద్వారా..
కేశవరావు మృతదేహాన్ని గురువారం ఉదయం హెలికాప్టర్ ద్వారా నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ పోలీస్ లైన్స్‌లో మిగతా అందరి మృతదేహాలతో పాటు ఎన్‌కౌంటర్‌లో స్వా«దీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇతర మావోల మృతదేహాలకు తెల్లని కవర్లు చుట్టగా కేశవరావుకు మాత్రం నల్లని కవర్ చుట్టారు. గురువారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు.