పంటలకు ‘డ్రైస్పెల్‌’ దెబ్బ! | Sakshi
Sakshi News home page

పంటలకు ‘డ్రైస్పెల్‌’ దెబ్బ!

Published Thu, Aug 31 2023 2:51 AM

Dryspell hit the crops no rains since month - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెల రోజులుగా చినుకు జాడలేక, ఎండలు పెరిగిపోయి రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. తొలుత రుతుపవనాల ఆలస్యం, తర్వాత జూలై భారీ వర్షాలు, మళ్లీ ఆగస్టులో డ్రైస్పెల్‌తో పంటల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో 63శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కరువు ఛాయలు కూడా నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి వానాకాలం పంటలు గట్టెక్కుతాయా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి ఆరుతడి పంటలు ఆగమవుతాయన్న ఆందోళన రైతులు, వ్యవసాయ అధికారుల్లో కనిపిస్తోంది. 

మొక్కజొన్న, పత్తికి నష్టం! 
వానలు పడటంలో ఎక్కువ విరామం రావడం మొ క్కజొన్నపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పంట ఎండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో చీడపీడల దాడి పెరిగింది. అనేకచోట్ల మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడిచేస్తోందని వ్యవసాయశాఖ బుధవా రం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పత్తిలో పేనుబంక, రసం పీల్చే పురుగుల దాడి పెరిగిందని.. వరిపై కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, కాండం కుళ్లు తెగులు, ఆకు ముడత తెగుళ్లు వస్తు న్నాయని హెచ్చరించింది. ఎండల కారణంగా సో యాబీన్‌ పంట ఎండిపోతోందని అధికారులు చెప్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పత్తి, మొక్కజొన్న పంటలు చేతికి రావడం కష్టమేనని.. దిగుబడులు పడిపోతాయని అంటున్నారు. 

వరి ఫుల్‌.. పప్పులు డల్‌ 
రాష్ట్రంలో ఈసారి వానాకాలం పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. సీజన్‌ సాధారణ సాగు విస్తీర్ణం ఆగస్టు చివరినాటికి 1.24 కోట్ల ఎకరాలుకాగా.. ఈసారి ఇప్పటివరకు 1.16 కోట్ల ఎకరాల్లో (93.61 శాతం) పంటలు సాగయ్యాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలైతే.. ఈసారి ఇప్పటివరకు 55.90 లక్షల ఎకరాల్లో (112.12 శాతం) నాట్లు పడ్డాయి. గత నెల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వరిసాగు జోష్‌ పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 5.32 లక్షల ఎకరాల్లో (56.39%) మాత్రమే సాగయ్యాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలైతే.. ఇప్పటివరకు 5.21 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 44.70 లక్షల ఎకరాల్లో (88.36 శాతం) వేశారు. వాస్తవంగా ఈ ఏడాది 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయశాఖ భావించింది. ఈ మేరకు రైతులకు పిలుపునిచ్చింది. కానీ సకాలంలో రుతుపవనాలు రాకపోవడం, కీలకమైన జూన్‌ నెల, జూలై రెండో వారం వరకు వర్షాలు లేకపోవడంతో అదను దాటిపోయింది. 

పంటలను కాపాడుకోవాలి: వ్యవసాయ వర్సిటీ 

  • జిల్లాల్లో నీటి వసతి గల రైతులు పత్తి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు వంటి పంటలకు నీటి తడులివ్వాలి. పూతదశలో ఉన్న మొక్కజొన్న పంటకు జీవసంరక్షక నీటి తడి ఇవ్వాలి. 
  • ప్రస్తుతం వరి పంట పిలక దశ నుంచి అంకురం దశలో ఉంది. కాండం తొలుచు పురు గు, అగ్గి తెగులు కలగచేసే కారకాలు కలుపు మొక్కలపై నివసించి వరి పంటను ఆశిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వరిలో ఆకు నల్లి ఆశించే అవకాశం ఉంది. 
  • పత్తి పంట పూత నుంచి కాయ అభివృద్ధి దశలో ఉంది. ఈ పంటలో పేనుబంక, రసం పీల్చే పురుగుల నివారణకు ప్లునికామిడ్‌ 0.4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 
  • మొక్కజొన్న పంట మోకాలి ఎత్తు దశ నుంచి కంకి ఏర్పడే దశల్లో ఉంది. మొక్కజొన్న లో కత్తెర పురుగు ఆశిస్తోంది. నివారణకు 0.4 మి.లీ.క్లోరంట్రానిలిప్రోల్‌ లేదా 0.5 మి.లీ. స్పైనటోరంను లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల పిచికారి చేయాలి. 
  • రాష్ట్రంలో సోయా పంట పూత నుంచి పిందె, కాయ అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో పెంకు పురుగు, కాండం ఈగ ఆశించేందుకు కారణమవుతాయి. ముందు జాగ్రత్తగా పురుగులు ఆశించకుండా 0.4 మి.లీ. థయోమిథాక్సిం లాంగ్డా సైలోత్రిన్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 
Advertisement
 
Advertisement