Electric Double Decker Buses Soon Roll Out on Hyderabad Roads
Sakshi News home page

హైదరాబాద్‌ రోడ్లపై త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సుల పరుగులు

Nov 3 2022 4:29 PM | Updated on Nov 3 2022 5:04 PM

Double Decker Electric Bus May Return to Hyderabad Soon - Sakshi

హైదరాబాద్ సిటీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు భాగ్యనగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి.

సాక్షి, హైదరాబాద్: సిటీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు భాగ్యనగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి. ఈసారి గతానికి భిన్నంగా ఎలక్ట్రిక్‌ బస్సులు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్‌ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్‌ సాగర్‌ మాత్రమే కాదు. డబుల్‌ డెక్కర్‌ బస్సులు కూడా గుర్తొస్తాయి. 1990వ దశకంలో పుట్టినవారు డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మళ్లీ హైదరాబాద్‌ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని తీసుకురావాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. 

సిటీలో డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని తిప్పాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌లో నెటిజన్లు రిక్వెస్ట్‌ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని తిప్పుతామని కేటీఆర్‌ హామీ కూడా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను కోరారు. దీంతో నగరంలో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని తిప్పేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని నడపనుంది.  


అద్దె ప్రాతిపదికన తీసుకుని.. 

► ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను అద్దెకు తీసుకొని నడిపేందుకు టీఎస్‌ఆర్‌టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఈ– డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడపనుంది. ఇందుకు సంబంధించిన టెండర్‌ను మరో వారంలో ఆహ్వానించనుంది. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు తమ బిడ్‌లను నమోదు చేసుకోవాలని టీఎస్‌ఆర్‌టీసీ ఆహ్వానించనుంది. బిడ్‌ గెలుచుకున్న కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు టీఎస్‌ఆర్‌టీసీతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ కంపెనీకి టీఎస్‌ఆర్‌టీసీ అద్దెను ఫిక్స్‌డ్‌గా చెల్లిస్తుంది.  


► చార్జీలు, రూట్లు లాంటి నిర్ణయాలన్నీ టీఎస్‌ఆర్‌టీసీ తీసుకుంటుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని పెంచి లాభాలవైపు పరుగులు తీసుకేందుకు టీఎస్‌ఆర్‌టీసీ అనేక చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి బస్సుల్ని కొనకుండా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటుంది. ఇక ఈ– డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని ఏ రూట్‌లో నడపాలన్నదానిపై ఇప్పటికే ఆర్‌టీసీ అధికారులు అధ్యయనం జరిపారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఫ్లైఓవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్లతో ఇబ్బంది లేని రూట్‌లోనే డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు రూట్‌లు ఫైనలైజ్‌ చేశారని వార్తలొస్తున్నాయి.  

► పటాన్‌చెరు– కోఠి, జీడిమెట్ల–సీబీఎస్, అఫ్జల్‌గంజ్‌– మెహిదీపట్నం రూట్లలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరిగే అవకాశాలున్నాయి. ఇక ముంబైలో ఇప్పటికే ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరుగుతున్నాయి. స్విచ్‌ మొబిలిటీ 22 మోడల్‌ బస్సుల్ని ముంబైలో ప్రజా రవాణా కోసం తిప్పుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని ఇండియాలోనే డిజైన్‌ చేసి తయారు చేయడం విశేషం. బృహత్‌ ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుస్తున్నాయి. (క్లిక్ చేయండి:  బస్టాప్‌లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..)

Advertisement
 
Advertisement
Advertisement