దక్షిణ ‘రింగు’.. కేంద్రానిదా, రాష్ట్రానిదా? | Discussion on the state government forming its own alignment with another consultancy | Sakshi
Sakshi News home page

దక్షిణ ‘రింగు’.. కేంద్రానిదా, రాష్ట్రానిదా?

Jun 30 2025 3:08 AM | Updated on Jun 30 2025 3:08 AM

Discussion on the state government forming its own alignment with another consultancy

కేంద్ర ప్రభుత్వ విజన్‌–2047 జాబితాలో చోటు 

అలైన్‌మెంట్‌ కూడా సిద్ధం..ఇప్పుడు వేరే అలైన్‌మెంట్‌ను సొంతంగా రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం  

సమాచారం లేదని, తమ అనుమతి కూడా లేదంటున్న ఎన్‌హెచ్‌ఏఐ 

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో గందరగోళం   

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగాన్ని ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ భాగం కూడా అధికారికంగా ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విజన్‌–2047 జాబితాలో అది కొనసాగుతోంది. సాధారణంగా ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఆ విభాగమే పర్యవేక్షిస్తుంది. వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఉండదు. 

అందుకే, దక్షిణ భాగానికి సంబంధించి ఢిల్లీ సంస్థ రూపొందించిన మూడు అలైన్‌మెంట్లలో ఒకదాన్ని ఎంపిక చేయగా, తుది ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. ఇప్పటికీ, ఢిల్లీ సంస్థతో ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పందం కొనసాగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో కన్సల్టెన్సీతో అలైన్‌మెంట్‌ను రూపొందింపజేసి ఆమోదం కూడా తెలపడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్రమే కొనసాగించాలంటూ లేఖ  
ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.21 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనాలున్నాయి. ఉన్న నిధులల్లో సింహభాగం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకే కేటాయించాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో దక్షిణ రింగును సొంతంగా చేపట్టడం అసాధారణ విషయమే. అందుకే దక్షిణ రింగును కూడా కేంద్రమే కొనసాగించాలని లేఖ రాసింది. ఇదే సమయంలో ఎన్‌హెచ్‌ఏఐ అ«దీనంలోని ఆ ప్రాజెక్టుకు తాను సొంతంగా అలైన్‌మెంట్, డీపీఆర్‌ తయారీ చేయటం ఇప్పుడు గందరగోళంగా మారింది. దీంతో అసలు ఈ ప్రాజెక్టు కేంద్రం పరిధిలో ఉందా, రాష్ట్రం పరిధిలో ఉందా అన్న సందిగ్ధత నెలకొంది.  

రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమేంటో మాకు తెలియదు: ఎన్‌హెచ్‌ఏఐ 
‘దక్షిణ రింగుకు రాష్ట్ర ప్రభుత్వంఅలైన్‌మెంట్‌ చేసుకోవటం, డీపీఆర్‌ తయారు చేస్తుండటం ఎందుకో మాకు తెలియదు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా మాకు ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదు. ప్రాజెక్టు నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తోందో మాకు తెలియదు’అని ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.  

జాప్యం జరుగుతోందని మేం చేస్తున్నాం: రాష్ట్ర ప్రభుత్వ అదీనంలోని ఎన్‌హెచ్‌ 
‘దక్షిణ రింగు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో భూముల ధరలు పెరిగి భూసేకరణ భారం పెరుగుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను రూపొందించుకుంటోంది. డీపీఆర్‌ కూడా తయారు చేస్తోంది. ఇదంతా ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనలననుసరించే జరుగుతున్నాయి. ప్రాజెక్టు విషయంలో తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి’అని రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎన్‌హెచ్‌ విభాగం ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.  

ఆ అలైన్‌మెంట్‌ ప్రకారం పనులు చేపట్టమని కోరే అవకాశం 
ఉత్తర–దక్షిణ రింగులను తనే చేపట్టేందుకు గతంలోనే కసరత్తు ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఏఐ దాన్ని కొనసాగిస్తోంది. అయితే, ప్రాధాన్యతాక్రమంలో ఉత్తర రింగుకు ముందు ఓకే చెప్పింది. ట్రాఫిక్‌ రద్దీ దక్షిణ రింగుపై అంతగా ఉండదని భావిస్తూ దాన్ని తదుపరి చేపట్టేందుకు తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టింది. అప్పట్లో ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించిన అలైన్‌మెంట్‌తో విభేదిస్తున్న రాష్ట్రప్రభుత్వం, తాను కోరుకుంటున్నట్టు ఫ్యూచర్‌ సిటీకి అనుసంధానమయ్యేలా కొత్త అలైన్‌మెంట్‌ను తానే రూపొందించి, దాని ప్రకారం రోడ్డును నిర్మించాలని కేంద్రాన్ని కోరబోతున్నట్టు తెలిసింది. దీనికి కేంద్రం ఓకే చెబుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగంతోపాటే దక్షిణ భాగ నిర్మాణం కూడా చేపట్టండి. ఈ ప్రాజెక్టులో జాప్యం లేకుండా చూడండి – ఇది గతేడాది చివరలో సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి చేసిన విన్నపం. ఢిల్లీలో కేంద్రమంత్రిని స్వయంగా కలిసి ఓ లేఖ కూడా రాశారు.  

రీజినల్‌ రింగురోడ్డు దక్షిణ భాగానికి ఓ ప్రైవేట్‌ కన్సల్టెన్సీ రూపొందించిన 208 కి.మీ. నిడివి గల అలైన్‌మెంట్‌కు వారం రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు దాని డీపీఆర్‌ తయారీకి ఏర్పాట్లు చేస్తోంది.  
ఇప్పుడీ రెండు విరుద్ధ అంశాలు ఇటు ఎన్‌హెచ్‌ఏఐ, అటు రాష్ట్రప్రభుత్వ అ«దీనంలోని ఎన్‌హెచ్‌ యంత్రాంగంలో అయోమయానికి కారణమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement