Telangana: సర్కారు ..తమిళి ‘సై’

Differences Between Telangana Governor State Govt Come To Fore - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ముదిరిన విభేదాలు

తన ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు 

ప్రారంభించే నిర్ణయంపై గవర్నర్‌ అసంతృప్తి

ప్రతిగా తమిళిసైను ఆక్షేపిస్తూ సర్కారు ‘అనధికార’ లీక్‌

గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ

కౌశిక్‌రెడ్డి, అమీనుల్‌ జాఫ్రీ అంశాలను కావాలనే నాన్చారనే విమర్శ

రాజ్యాంగ విరుద్ధంగా సొంత ప్రసంగాలు చేశారని మండిపాటు..

ఇచ్చిపుచ్చుకునే ధోరణి గవర్నర్లకు అవసరమనే వ్యాఖ్య

రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు కనిపిస్తున్నాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం మొదలైంది. సంప్రదాయం ప్రకారం శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై గవర్నర్‌ తమిళిసై భగ్గుమన్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా తన వాదనను లీక్‌ చేసింది. గవర్నర్‌ తమిళిసై తన అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారని ఆ ప్రకటన ఆరోపించింది.

బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై.. తెలంగాణకు గవర్నర్‌గా వచ్చినా తన పాత వాసనలను పోగొట్టుకోలేదని వ్యాఖ్యానించింది. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలోనే గవర్నర్‌తో అసలు సమస్య ఉందని.. ఉన్నత మర్యాదలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంతో హఠాత్తుగా కయ్యం పెట్టుకున్నారని పేర్కొంది. ఈ ఘటనల నేపథ్యంలో.. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వాస్తవానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు నడిచినంత కాలం ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని రాజకీయ వర్గాలు  చెప్తున్నాయి.

రబీ ధాన్యాన్ని కొనబోమన్న కేంద్రంపై సీఎం కేసీఆర్‌ మండిపడటం, కేంద్ర ప్రభుత్వంపై అవినీతి, అసమర్థత ఆరోపణలు చేయడం మొదలైనప్పటి నుంచీ.. విభేదాలు వచ్చాయని అంటున్నాయి. ఇక గవర్నర్‌ తమిళిసై.. ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించడానికి రాజ్‌భవన్‌ గేటు వద్ద గ్రీవెన్స్‌ బాక్స్‌ ఏర్పాటు చేశారు. ఇటీవలి గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో సైతం ఉస్మానియా సహా ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇవి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయని.. తాజాగా బడ్జెట్‌ సమావేశాల విషయంగా గవర్నర్‌ విమర్శలు, ప్రభుత్వ స్పందనతో.. విభేదాలు తారస్థాయికి చేరినట్టేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top