కామారెడ్డి క్రైం: మగ సంతానం లేకపోతే ఏంటి నేను లేనా అంటూ ఓ కుమార్తె తన తండ్రికి తలకొరివిపెట్టింది. ఈ ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో జరిగింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అలకుంట్ల సుదర్శన్‌కు భార్య, ముగురు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజులుగా తన కుటుంబంతో కలిసి జిల్లాకేంద్రంలోని స్నేహపురి కాలనీలో అద్దెకు ఉంటున్నాడు.
స్వగ్రామంలో తనకు ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో సుదర్శన్ మృతి చెందగా సోమవారం పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తలకొరివి పెట్టడానికి వారసుడు లేకపోవడంతో పెద్ద కూతురు దేవిజ్ఞ తన తండ్రికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు వచ్చింది. కొడుకులు లేక కూతురే అంత్యక్రియలు నిర్వహించడం అక్కడున్న అందర్నీ కంటతడి పెట్టించింది.


