మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈపథకం ద్వారా యువతకు రాయితీ రుణాలను అందించడమే లక్ష్యంగా దరఖాస్తులను సైతం స్వీకరించింది. కానీ నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణాలను అందించకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న యువతలో నైరాశ్యం నెలకొంది.
జిల్లాలో 58వేలకు పైగా దరఖాస్తులు..
గత ప్రభుత్వాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా ఆయా సామాజిక వర్గాల యువతకు రాయితీపై రుణాలను పంపిణీ చేసేవారు. సామాజిక వర్గాల వారీగా ఆయా కార్పొరేషన్‌ల ద్వారా రాయితీని లబ్ధిదారులు పొందేవారు. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితబంధు, బీసీబంధు పథకాల పేరిట కొంత మందికే లబ్ధి చేకూర్చి ముఖం చాటేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్‌లను అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చి ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమం కింద రాయితీ రుణాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో భాగంగా జిల్లాలో సుమారు 58వేల మంది తొమ్మిది నెలల కింద దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఏ ఒక్క దరఖాస్తుకు కూడా రుణం పంపిణీ చేయలేదు. రాజీవ్ యువ వికాసం పేరిట అన్ని కార్పొరేషన్‌ల ద్వారా ఆయా సామాజిక వర్గాల నిరుద్యోగులకు రుణాలు అందించి వారి స్వయం ఉపాధికి బాటలు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం విఫలం కావడంతో యువతకు నిరాశే మిగిలింది. దీంతో రాయితీ రుణాల పంపిణీ లక్ష్యంకు ప్రభుత్వం గండికొడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిన్న రుణాలకు వంద శాతం రాయితీ..
రాజీవ్ యువ వికాసం కార్యక్రమంలో భాగంగా వివిధ కార్పొరేషన్‌ల ద్వారా రూ.50వేల వరకూ రుణ సదుపాయం కల్పిస్తే వంద శాతం రాయితీని ప్రకటించారు. రూ.లక్ష వరకు రుణం పొందితే 90 శాతం రాయితీ, రూ.2లక్షల వరకు రుణం పొందితే రూ.80శాతం రాయితీని రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందినవారికి 70 శాతం రాయితీని అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ మంది రూ.4లక్షల వరకు రుణాలు పొందాలని దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకులు కూడా సమ్మతించినా ప్రభుత్వం రాయితీ నిధులను విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు ఏమీ చేయలేకపోయారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా యువతీయువకులకు రాయితీ రుణాలు అందిస్తామని అప్పట్లో ప్రకటించగా ఇప్పటి వరకూ ఊసెత్తేవారు కరువయ్యారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రాయితీ రుణాలను పంపిణి చేసే విషయంలో పునరాలోచన చేసి పథకాలను పునరుద్దరించాలని పలువురు కోరుతున్నారు.
యువతకు ఉపాధిని కల్పించడానికి, రాయితీ రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. కానీ ఆ దరఖాస్తులను చెత్తబుట్ట దాఖలు చేయడం ఎంత వరకూ సమంజసం. ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి.
– ఉమేష్, ధర్మ సమాజ్ పార్టీ
మండల అధ్యక్షుడు, మోర్తాడ్
స్వయం ఉపాధి కోసం
‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని
ప్రారంభించిన ప్రభుత్వం
భారీగా దరఖాస్తు చేసిన నిరుద్యోగులు
నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రాని
రాయితీ రుణాలు


