రెంజల్: ఓ ప్రజాప్రతినిధి తన సొంత పొలానికి విద్యుత్ లైన్‌ను వేసుకునేందుకు యత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా.. మండలంలోని కళ్యాపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధికి గ్రామంలోని శ్మశాన వాటిక పక్కన పట్టా భూమి ఉంది. పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసం ఇటీవల విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోగా, ఎస్టిమేషన్ వేసి అందుకు అవసరమైన నిధులు డీడీ రూపంలో చెల్లించాలని ట్రాన్స్‌కో వారు సూచించారు. కానీ సదరు ప్రజాప్రతినిధి ఇవేమి పట్టించుకోకుండా సోమవారం గ్రామ చెరువు సమీపంలో వృథాగా ఉన్న 6 విద్యుత్ స్తంభాలను తీసుకొని తన పొలం పక్కన ఉన్న శ్మశాన వాటిక దగ్గర పాతించారు. విషయం తెలుసుకున్న స్థానికులు ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించారు. అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో అతడు వాటిని యథాస్థానంలో పెట్టాడు. మళ్లీ మంగళవారం విద్యుత్ స్తంభాలను తిరిగి శ్మశానవాటిక దగ్గర పాతించారు. ఈ విషయమై ఇన్‌చార్జి లైన్‌మన్ విచారణ చేశారు. సమస్యను తమ ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆయన తెలిపారు. తదుపరి చర్యలు వారు తీసుకుంటారని ఇన్‌చార్జి ఏఈ కిశోర్ వివరించారు.
శ్మశాన వాటికకు కరెంట్ లేకపోవడంతో గతంలో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. స్థానికుల సూచన మేరకు చెరువు కట్ట వద్ద నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తీసుకొచ్చి పాతించాను. ఇందులో ఎలాంటి దురుద్దేశంలేదు. కావాలనే కొందరు తనపై కక్ష పెంచుకుని రాద్ధాంతం చేస్తున్నారు.
– భానుచందర్, సర్పంచ్, కళ్యాపూర్
15 ఏళ్ల క్రితం గ్రామంలోని చెరువు కట్ట పక్కన విద్యుత్ అధికారులు స్తంభాలను ఏర్పాటు చేశారు. అధికారులకు సమాచారం లేకుండా సర్పంచ్ 6 స్తంభాలతోపాటు విద్యుత్ తీగలను తీసుకుని శ్మశాన వాటిక పేరుతో తన సొంత పొలం వద్దకు తీసుకెళ్తున్నాడు. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– కాశం సాయిలు, వీడీసీ చైర్మన్
కళ్యాపూర్‌లో సొంత పొలానికి
విద్యుత్ లైన్ తీసుకునేందుకు
ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నం!
అడ్డుకున్న గ్రామస్తులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని
ట్రాన్స్‌కో అధికారులు


