● జైలులో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు
● నిందితులపై పాత కేసులు
● వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య
నిజామాబాద్‌అర్బన్: ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముఠాలో మొత్తం 10 మంది ఉన్నారు. ఏడుగురిని అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులు గత మూడు నెలలుగా నిజామాబాద్ జిల్లాలోని నవీపేట, నందిపేట, బోధన్ ఎడపల్లి, ప్రాంతాలతో పాటు నిర్మల్ జిల్లా బాసర, ముధోల్, తానూరు, బైంసా, కుంటాల, నర్సాపూర్ జి మండలాలలో ట్రాన్స్‌ఫార్మర్‌ల రాగి తీగలను దొంగతనం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడు నిజామాబాద్‌లోని ఆటోనగర్‌కు చెందిన అఫ్జల్ ఖాన్‌ను, ముఠా సభ్యులు రెంజల్‌కు చెందిన సిద్ధిఖాన్, ధర్మపురి హిల్స్‌కు చెందిన అర్వాజ్ ఖాన్, భైంసాకు చెందిన మెహబూబ్ ఖాన్, అర్సపల్లికి చెందిన బోర్గే బాలాజీ, నాందేడ్‌కు చెందిన ఆరిఫ్, వెంగళరావు కాలనీకి చెందిన మహమ్మద్ రాజాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెంజల్‌కు చెందిన హుస్సేన్ ఖాన్, జిల్లా కేంద్రంలోని సాగర్‌హిల్స్‌కు చెందిన షేక్ తహేర్, భైంసాకు చెందిన మహమ్మద్ అప్సర్ పరారీలో ఉన్నారు. నిందితుల్లో కొందరు గతంలో ఆవుల దొంగతనం, బైకుల చోరీ కేసుల్లో జైలుకు వెళ్లగా, అక్కడ పరిచయమై, ముఠాగా ఏర్పడ్డారు. పగలు రెక్కి నిర్వహించి రాత్రికి బైకులపై వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నారు. 34 చోట్ల సుమారు 8 నుంచి 10 క్వింటాళ్ల రాగి తీగలను చోరీ చేసి, నిజామాబాదులోని ఏపీహెచ్‌బీ కాలనీలో ఒక రూమును అద్దెకు తీసుకొని దాచిపెట్టేవారు. అక్కడ నుంచి సమయానుకూలంగా కిలోకి రూ. 800 చొప్పున విక్రయించేవారు. వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడేవారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు సీపీ సాయి చైతన్య వివరించారు. నిందితుల నుంచి 20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, రూ.2,75,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, చోరీకి వినియోగించే పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ ప్రకాష్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట ఎస్సై శ్రీకాంత్, యాదగిరి గౌడ్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, ఐదో టౌన్ ఎస్సై గంగాధర్, ఏఎస్‌ఐ గఫార్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, రాజారెడ్డి, సందీప్, అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, నాగరాజ్ శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ తదితరులు పాల్గొన్నారు.


