గూగుల్‌లో వాటి కోసం వెతికారా.. మన బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీనే!

Cyber Crime: Police Warns Fraud Links And Numbers In Google Hyderabad - Sakshi

సైబర్‌ నేరస్తుల కొత్త పంథా 

గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతకొద్దు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా, బ్యాంక్‌ల విలీనం, వర్క్‌ ఫ్రం హోమ్, పార్ట్‌ టైం జాబ్, కస్టమర్‌ కేర్, ఇన్వెస్ట్‌మెంట్స్‌.. ప్రతిదీ సైబర్‌ నేరస్తుల మోసాలకు వేదికలుగా మారాయి. కస్టమర్‌ కేర్‌ నంబర్ల కోసం గూగుల్‌లో వెతికి.. దానికి ఫోన్‌ చేసి మోసపోయామని ఫిర్యాదు చేసే బాధితుల సంఖ్య పెరిగిపోయిందని సైబర్‌ పోలీసులు తెలిపారు. గూగుల్‌లో వచ్చిన నంబరుకు కాల్‌ చేస్తే కస్టమర్‌ చార్జీ కోసం రూ.10ని మోసగాళ్లు పంపే లింక్‌ ద్వారా చెల్లించాలని కోరినా, ఎనీడెస్క్, క్విక్‌ సపోర్ట్, టీం వ్యూయర్‌ వంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయమని అడిగినా అది మోసమని గుర్తించాలని సూచించారు.

ఏదైనా కంపెనీకి సంబంధించిన కస్టమర్‌ కేర్‌ నంబరును తెలుసుకోవాలంటే ఆయా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మాత్రమే సమాచారం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 

పార్ట్‌ టైం జాబ్స్, ఓఎల్‌ఎక్స్‌ మోసాలు కూడా.. 
పార్ట్‌ టైం జాబ్స్‌ పేరిట సైబర్‌ నేరస్తులు నిరుద్యోగులను మెయిల్స్‌ పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ కెవైసీ అప్‌గ్రేడ్, క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ పెంచుతుమాని మాట్లాడుతూ కస్టమర్ల ఖాతాను ఖాళీ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరు నో రిస్క్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, గ్యారెంటెడ్‌ రిటర్న్స్, పోంజీ అని రకరకాల స్కీమ్‌ పెట్టుబడులు పెట్టి మోసాలకు గురవుతున్నారు. బహుమతులు,పెట్టుబడులు, లాటరీ, డిస్కౌంట్‌ అని రకరకాల ఎత్తుగడలతో సామాన్యులకు ఎరవేసి మోసాలకు పాల్పడుతున్నారు. దురాశ, తెలియకపోవటం, నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజలు మోసపోతున్నారు. 

బాధితులు 30–40 ఏళ్ల వయస్కులే.. 
సైబర్‌ నేరాలలో ప్రధానంగా కస్టమర్‌ కేర్, ఓఎల్‌ఎక్స్, జాబ్, కేవైసీ, ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట మోసాలు జరుగుతుంటాయి. ఎక్కువగా 30–45 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్లే సైబర్‌ నేరాల బారిన పడుతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనల మోసాలు, జార్ఖండ్‌ నుంచి కస్టమర్‌ కేర్‌ మోసాలు జరుగుతున్నాయి. పెట్టుబడుల పేరిట జరిగే మోసాలకు లింక్‌లు ఎక్కువగా విదేశాలలో ఉంటున్నాయి. ఆయా కేసుల విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  

గతేడాది సైబరాబాద్‌లో 1,212 కేసులు.. 
గతేడాది సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,212 సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో సుమారు రూ.22 కోట్ల మోసాలు జరిగాయి. సైబరాబాద్‌లో రోజుకు 15–20 సైబర్‌ నేరాలు నమోదవుతున్నాయి. రోజులో కనిష్టంగా రూ.30 వేలు, గరిష్టంగా రూ.1.50 కోట్ల విలువ చేసే నగదు మోసాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. కస్టమర్‌ కేర్, ఓఎల్‌ఎక్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ ఎక్కువగా జరిగాయి.

చదవండి: హుస్సేన్‌సాగర్‌ వద్ద ఉండలేకపోయా.. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top