హుస్సేన్‌సాగర్‌ వద్ద ఉండలేకపోయా.. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

Telangana High Court Chief Justice Satish Chandra Sharma On Hussain Sagar - Sakshi

హైకోర్టు దగ్గర ఉన్న మూసీ నదిని చూసి మురుగునీటి కాలువ అనుకున్నా..

నదులు, సరస్సులను కలుషితం చేయొద్దు 

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ 

నాంపల్లి (హైదరాబాద్‌): పర్యావరణాన్ని రక్షించేందుకు కేవలం ప్రభుత్వంపైనే బాధ్యత వేయకుండా ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి గగన్‌విహార్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్‌ అథారిటీ నూతన కార్యాలయాన్ని ఆయన అథారిటీ చైర్మన్‌ జస్టిస్‌ ప్రకాశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ సతీష్‌ చంద్ర సభనుద్దేశించి మాట్లాడారు.

‘నేను మధ్యప్రదేశ్‌లో ఉన్నప్పుడు హుస్సేన్‌సాగర్‌ గురించి ఎంతో గొప్పగా విన్నా. మొదటిసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు హుస్సేన్‌సాగర్‌ను చూడటానికి వెళ్లాను. అయితే, అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయా. అలాగే హైకోర్టు దగ్గర ఉన్న మూసీ నదిని చూసి తొలుత మురుగునీటి కాలువని అనుకున్నా. కానీ, నా డ్రైవర్‌ అది నది అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయా’అని జస్టిస్‌ సతీష్‌ చంద్ర చెప్పారు. తానొకరోజు విమానాశ్రయం వెళ్తోంటే కొందరు వ్యక్తులు సంచుల్లో చెత్తను తీసుకొచ్చి రోడ్డు పక్కనే వేశారని, తన కుమారుడు కారు ఆపి ఆ చెత్తను చెత్తకుండీలో వేశారని గుర్తుచేసుకున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సిటీకి ఐదుసార్లు క్లీన్‌ సిటీ అవార్డు వచ్చిందని, అక్కడి కలెక్టర్‌తోపాటు పలువురు అధికారులు మరుగుదొడ్ల పక్కనే పుట్‌ఫాత్‌పై భోజనం చేశారని చెప్పారు. నదులు, సరస్సులు, పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తున్న వారిపై ఈ అథారిటీతోపాటు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా ఉండి కాలుష్య నియంత్రణకు పాటుపడాలని చీఫ్‌ జస్టిస్‌ చేతులు జోడించి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అథారిటీ మెంబర్‌ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.    
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top