Omicron In Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్‌ కలకలం

Covid 19: Omicron Case Detected In Rajanna Siricilla Telangana - Sakshi

గూడెంలో తొలి కేసు 

చిప్పలపల్లి వ్యక్తిపై అనుమానాలు

13 మంది క్వారంటైన్‌

సాక్షి,సిరిసిల్ల( కరీంనగర్‌): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరింది. ముస్తాబాద్‌ మండలం గూడెంకు చెందిన వ్యక్తి ఇటీవల దుబాయ్‌ నుంచి ఇంటికి చేరగా.. ఆయనకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం జిల్లాలో కలకలం సృష్టించింది. వెంటనే ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని వైద్యసేవల కోసం హైదరాబాద్‌ తరలించారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురిని, అతన్ని కలిసిన మరో ఏడుగురిని క్వారంటైన్‌ చేశారు. గూడెంలో ఒమిక్రాన్‌ కట్టడికి వీధుల్లో శానిటైజేషన్‌ చేశారు. ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితోపాటు దుబాయ్‌ నుంచి వచ్చిన చిప్పలపల్లికి చెందిన మరో వ్యక్తి ఇంటిని కూడా క్వారంటైన్‌ చేసి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

16న గూడెం వచ్చాడు
ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన సదరు వ్యక్తి ఈ నెల 16న గూడెం వచ్చాడు. ఆయన దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులోనూ ఒమిక్రాన్‌ పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. కానీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణకు జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షల కోసం సేకరించిన నమోనాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి ఇప్పటి వరకు ఐదు రోజుల్లో ఎవరెవరిని కలిశారో వైద్యాధికారులు ఆరా తీసి క్వారంటైన్‌ చేశారు. ప్రస్తుతం 13 మందిని క్వారంటైన్‌ చేసినట్లు సమాచారం.

వేగంగా వ్యాక్సినేషన్‌
జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో మొదటి డోస్‌ డిసెంబరు నెలాఖరులోగా పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లాలో చిక్కకుండా తప్పించుకుంటున్న వారిని గుర్తించేందుకు డోర్‌ టు డోర్‌ వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆశవర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా వ్యాక్సినేషన్‌ వంద శాతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వ్యాక్సినేషన్‌ శిబిరాలను పరిశీలిస్తున్నారు. తప్పించుకు తిరిగే వారిని ఒప్పించి టీకాలు ఇవ్వాలని కృషి చేస్తున్నారు. జిల్లాలో కొందరు టీకాకు అర్హత ఉన్న వారు వలస వెళ్లారు. వారిని మినహాయించి, ఆధార్‌కార్డు నంబరుతో సహా అర్హులకు టీకాలు ఇవ్వాలని భావిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. ఒమిక్రాన్‌ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

జిల్లాకు విదేశీ ముప్పు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారు. వారిలో చాలా మంది స్వస్థలాలకు వస్తూ.. పోతూ ఉంటారు. కోవిడ్‌ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ క్వారంటైన్‌ ఉంటూనే గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్నారు. కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఒమిక్రాన్‌ వైరస్‌ జిల్లాకు చేరేందుకు అవకాశం కలిగింది. నిజానికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగాపూర్, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లోనూ జిల్లా వాసులు ఉన్నారు. గల్ఫ్‌ దేశాల నుంచే రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి. జిల్లాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. దీంతో జిల్లా వైద్యులు అప్రమత్తమయ్యారు.

జాగ్రత్తలు తప్పనిసరి
జిల్లాకు యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఎవరూ ఆందోళన చెందకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైరస్‌ సోకిన వారికి గొంతునొప్పి, జలుబు, జ్వరం, దగ్గు విపరీతమైన అలసట ఉంటుంది. వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం లక్షణాలు ఉంటాయి. ఒళ్లు నొప్పులు ఉంటాయి. అందరూ మాస్క్‌లు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. నిర్లక్ష్యంగా ఉంటే ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తుంది.
– డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, జిల్లా వైద్యాధికారి 

చదవండి: భిక్షాటన చేస్తుంటే చేరదీసి స్కూల్‌కి పంపారు.. రెండు నెలల తర్వాత..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top