సొంత పార్టీ భవిష్యత్తుపైనే ఆందోళన..ఇంకా ఫెడరల్‌ ఫ్రంటా?

Congress party mp Revanth Reddy Slams Kcr Over Federal Front - Sakshi

 సీఎం కేసీఆర్‌ను ఎద్దేవా చేసిన రేవంత్‌

టీఆర్‌ఎస్‌లో త్వరలోనే తిరుగుబాటు 

సీఎం పూజలకెళ్లారా.. రాజకీయ చర్చలకెళ్లారా? 

రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో సొంత పార్టీ భవిష్యత్తుపైనే సీఎం కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారు. జాతీయ స్థాయిలో థర్డ్, ఫెడరల్‌ ఫ్రంట్‌ల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు’అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాగ్రహానికి గురవుతోందని, ఆ పార్టీలో త్వరలోనే అంతర్గత తిరుగుబాటు రావొచ్చని జోస్యం చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆలోచనల మేరకు ఫెడరల్‌ ఫ్రంట్‌ను కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్నారు. ఆ ఫ్రంట్‌ ద్వారా కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసి బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నదే కేసీఆర్‌ ఆలోచన. కేసీఆర్‌ ప్రధాని మోదీ ఏజెంట్‌. సెక్యులర్‌ పార్టీలు గమనించాలి’అన్నారు. తన మతపరమైన పర్యటనలను రాజకీయాలతో, రాజకీయ పర్యటనలను మతంతో కలిపేస్తున్న కేసీఆర్‌.. తమిళనాడుకు దేవాలయాల్లో పూజలు చేసేందుకు వెళ్లారా? ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌తో రాజకీయ చర్చలు జరిపేందుకు వెళ్లారా స్పష్టం చేయట్లేదని విమర్శించారు. నేరుగా స్టాలిన్‌ను కలిసేందుకు వెళ్తే ఆయన బీజేపీ ఏజెంటని బట్టబయలు అవుతుందనే ఆలయాల సందర్శన పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ తమిళనాడు పర్యటన రాజకీయ పరమైనదా? మతపరమైనదా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.  

పాపాలు కడిగేసుకోవాలనే.. 
దేవాలయాలను సందర్శించడం ద్వారా తన పాపాలను కడిగేసుకోవాలని సీఎం భావిస్తున్నారని.. సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా రైతులను మోసం చేసి క్షమాపణలు చెప్పుకునేందుకు దేవాలయాలు తిరుగుతున్నారని రేవంత్‌ విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగేందుకు కేసీఆరే కారణమన్నారు. వరి సేకరణపై అనిశ్చితి, తదుపరి పంటపై స్పష్టత లేక రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు జీవో 421లోని నిబంధనల ప్రకారం రూ. 6 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులు ఆశ కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, రైతుల హక్కులు కాపాడేందుకు కాంగ్రెస్‌ పోరాడుతుందని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top