
రాష్ట్రంలో రూ.వేల కోట్లతో రహదారుల అభివృద్ధి: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ రైజింగ్‌లో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాలి
గత ప్రభుత్వం రూ.45 వేలకోట్ల అభివృద్ధి పనుల బకాయిలను వారసత్వంగా ఇచ్చింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేల కోట్ల రూపాయలతో రహదారులను నిర్మించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రహదారుల నిర్మాణంతో పరిశ్రమలు పెరిగి తద్వారా మన రాష్ట్ర యువతకు ఉపాధి, ఆదాయం సమకూరుతుందన్నారు. తెలంగాణ రైజింగ్‌లో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) పద్ధతిలో రహదారులు నిర్మించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
దీనిపై మంగళవారం హైటెక్స్‌లో జరిగిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, బ్యాంకర్ల అవగాహన కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 7,947 కి.మీ. మేర, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 5,190 కి.మీ. మేరకు రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
కేబినెట్ ఆమోదించిన రోడ్డు పనులకు త్వరితగతిన టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని చెప్పారు. కాంట్రాక్టర్ల ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు రూ.1.75 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ఒప్పందాలు చేసుకొని, 45 వేల కోట్ల విలువైన పనులకు టోకెన్లు జారీ చేసి ఆ బకాయిలు చెల్లించకుండా తమకు వారసత్వంగా ఆర్థిక భారాన్ని మిగిల్చి వెళ్లారని భట్టి దుయ్యబట్టారు.
రహదారులను అనుసంధానిస్తాం: కోమటిరెడ్డి
గ్రామ, మండల, జిల్లా రహదారులను అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు వరుసల రోడ్లు, మండలాలనుంచి జిల్లాలకు రెండు వరుసల రోడ్లు వేస్తా మన్నారు. అలాగే, అన్ని గ్రామాలను కలుపుతూ అన్ని వాతావరణాలకు అనుకూలమైన రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. ‘ఈ విధానంలో ప్రభుత్వం 40 శాతం నిధులను 4 శాతం లెక్కన 10 వాయిదాల్లో చెల్లిస్తుంది.
ఇందులో కేవలం 10 శాతం నిధులు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. 60 శాతం నిధులను కాంట్రాక్టరు భరించాలి. వారి పనితీరు ఆధారంగా ఆరు నెలలకోమారు ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది’అని కోమటిరెడ్డి చెప్పారు. మారుమూల గూడెంలు, తండాలు, పల్లెలకు రహదారి వ్యవస్థను బలోపేతం చేసేందుకు హామ్ ప్రాజెక్టుతో శ్రీకారం చుట్టామని మంత్రి సీతక్క అన్నారు.
కాలుష్య పరిశ్రమలను తరలించండి: భట్టి
కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్ ఔట ర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశాన్ని కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిర్వహించారు. కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు గల అవకాశాలపై చర్చించారు. కాలుష్య పరిశ్రమల వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని భట్టి చెప్పారు.