
ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పి.నవీన్‌యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో కీలకమైన అఫిడవిట్‌ను ఆయన జతపర్చారు. ఈ మేరకు తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. చేతిలో నగదు రూ.4 లక్షలు, భార్య చేతిలో రూ.2 లక్షలు నగదు ఉందని, ఐదు బ్యాంక్ ఖాతాల్లో రూ.37.6 లక్షలు తన పేరు, తన భార్య పేరున రెండు అకౌంట్లలో రూ.10 వేలు నిల్వ ఉన్నట్లు చెప్పారు.
రూ. 7 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని, తన పేరున స్కోడా కారు, తన భార్య పేరిట హుందాయ్ ఐ10 కారు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 11 తులాల బంగారం, తన భార్య పేరున రెండు కేజీల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున 14.39 ఎకరాల వ్యవసాయ భూమి, యూసుఫ్‌గూడలో 860 గజాల ఇంటి స్థలం, భార్య పేరుతో 4.30 ఎకరాల వ్యవసాయ భూమి, 466 గజాల స్థలంలో ఇళ్లు ఉన్నాయన్నారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు తన పేరిట, రూ.5.75 కోట్లు భార్య పేరిట ఉన్నాయన్నారు. తనకు అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా అఫిడవిట్‌లో పొందుపర్చారు.