సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ చలి హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 11 నుండి 19 వరకు.. ముఖ్యంగా 13 నుండి 17 నవంబర్ మధ్య కాలంలో తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత కనిపించదు. కానీ ఈ సంవత్సరం 8–10 రోజుల పాటు చలి ప్రభావం గణనీయంగా ఉండబోతోందని అంచనా.
పైన ఫొటోలో పింక్,బ్లూ కలర్‌లో సూచించిన జిల్లాలు:
ఇక్కడ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ (10°C కంటే తక్కువ) వరకు పడిపోవచ్చు. ఈ ప్రాంతాల్లో ఉదయపు వేళల్లో తీవ్రమైన చలి ఉంటుంది. బ్లూ కలర్ జిల్లాలు (హైదరాబాద్ సహా): ఉష్ణోగ్రతలు 11°C–14°C మధ్య ఉండే అవకాశం. మోస్తరు చలి, కానీ ఉదయపు వేళల్లో జాగ్రత్త అవసరం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో ఇక్కడ మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C–17°C మధ్య ఉండవచ్చు. ఈ ప్రాంతాల్లో చలి ప్రభావం తక్కువగా ఉండే అవకాశం.
జాగ్రత్తలు అవసరం
ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ తగు సూచనలిచ్చింది. ఉదయపు, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు చలి నుంచి సంరక్షించేలా వస్త్ర రక్షణ తప్పనిసరి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు చలికి అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరం. వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలి, అధికారుల సూచనలు పాటించాలి.
వాతావరణ శాఖ అంచనా:
ఉత్తరాది నుంచి వచ్చే వాయుగుండాల ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి కంటే 3°C–5°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. అందుకే ప్రజలు ఈ చలి తీవ్రతను తేలికగా తీసుకోకుండా, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


