ఇకపై పాలన ఫ్యూచర్‌ సిటీ నుంచే: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Says Governance will now be from Future City | Sakshi
Sakshi News home page

ఇకపై పాలన ఫ్యూచర్‌ సిటీ నుంచే: సీఎం రేవంత్‌

Sep 29 2025 1:24 AM | Updated on Sep 29 2025 1:26 AM

CM Revanth Reddy Says Governance will now be from Future City

గీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి విక్రమార్క. నరేందర్‌రెడ్డి, మల్‌రెడ్డి, అడ్లూరి, శ్రీధర్‌బాబు, నిర్మలాజగ్గారెడ్డి, కేఎల్‌ఆర్‌ తదితరులు

నెలలో 3, 4 రోజులు నేను, భట్టి ఇక్కడే ఉంటాం : సీఎం రేవంత్‌

పదేళ్లు అవకాశమిస్తే ఫార్చ్యూన్‌ 500 కంపెనీలను ఇక్కడికి రప్పిస్తా 

ఇక్కడి నుంచి బందరు పోర్ట్‌కు రోడ్డు, చెన్నై, బెంగళూరుకు బుల్లెట్‌ రైళ్లు 

మీ భూములు గుంజుకోం.. ఒప్పించి, మెప్పించే తీసుకుంటాం 

డిసెంబర్‌లో యంగ్‌ ఇండియా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనం ప్రారంభం

ఎఫ్‌సీడీఏ భవనాలు,గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుకు శంకుస్థాపన  

సాక్షి, రంగారెడ్డి జిల్లా: త్వరలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచే పరిపాలన సాగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇకపై సచివాలయంలో కాకుండా ఫ్యూచర్‌సిటీ ఆఫీ సులో కూర్చు ని పనిచేస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవన నిర్మాణంతోపాటు రావిర్యాల నుంచి ఆమనగల్‌ వరకు నిర్మించనున్న రేడియల్‌ రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ఆదివారం శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘భూమి విలువ నాకు తెలుసు. వ్యవసాయంతోనే కాదు వ్యాపారంలోనూ భూమితో నాకు సంబంధం ఉంది. మీ తాతల నాటి ఆస్తులు గుంజుకునే ఆలోచన నాకు లేదు. బాధితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే భూములు తీసుకుని ముందుకు వెళ్తాం. డిసెంబర్‌లో యంగ్‌ ఇండియా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించుకోబోతున్నాం. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తాం. ఇకపై సచివాలయంలో కాకుండా ఫ్యూచర్‌సిటీ ఆఫీసులో కూర్చుంటా. నెలకు మూడుసార్లు ఇక్కడే ఉంటా.  

ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఇకపై ఇక్కడి నుంచే చేపడుతా. నాతోపాటు ఉపముఖ్య మంత్రి భట్టి కూడా నెలకు నాలుగుసార్లు ఇక్కడికి వస్తారు. ఆయన కూడా తన కార్యకలాపాలను ఇక్కడి నుంచే కొనసాగిస్తారు. సింగరేణి సంస్థ కోసం 10 ఎకరాలు కేటా యించి, 2026 డిసెంబర్‌లోగా ఆఫీసును ప్రారంభించాల్సిందిగా కోరుతున్నా. ఫ్యూచర్‌సిటీలో ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్లు కూడా తొలగించి, యూజీ కేబుల్స్‌ వేయబోతున్నాం. ఈ ఫ్యూచర్‌సిటీలో ఫార్చూన్‌ 500 జాబితాలోని కంపెనీలు ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకు నగరంలో 85 వరకే ఉన్నాయి. రాబోయే పదేళ్లలో ప్రతి కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా తీర్చిదిద్దుతున్నాం’అని వివరించారు.  

భావితరాల కోసమే మా తపన 
భావితరాల బంగారు భవిష్యత్తు కోసమే తమ ప్రభుత్వం కష్టపడుతోందని సీఎం రేవంత్‌ తెలిపారు. ‘ఈరోజు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ మంచి సంకల్పంతో చేపట్టిన నవ్య.. భవ్య.. భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి శంకుస్థాపన కోసం వరుణుడ కూడా సహకరించాడు. రేవంత్‌రెడ్డికి భూములున్నాయని చెప్తున్నారు. ఆయన కోస మే నగరం కడుతున్నారని ఆరోపిస్తున్నారు. నాకు భూమి ఉంటే భూమి మీదే ఉంటుంది. రహస్యంగా దాచుకోవడానికి నా దగ్గరేమీ లేదు. నేను నాగురించో.. నా సహచర మంత్రుల గురించో ఆలోచన చేయడం లేదు. మేమంతా రేపటి తరాల కోసమే ఆలోచన చేస్తున్నాం’అని సీఎం పేర్కొన్నారు.  

న్యూయార్క్‌లో ఉన్నవాళ్లు చెప్పుకునేలా చేస్తా 
‘కుతుబ్‌షాహీలు, నిజాంలు పునాదులు వేసిన హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలు నేడు ఎంతో అభివృద్ధి చెందాయి. నాడు చంద్రబాబు, వైఎస్సార్‌ మాకెందుకు అనుకుని ఉంటే..ఇవాళ హైటెక్‌సిటీ, ఔటర్‌రింగ్‌రోడ్డు, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వచ్చేవి కాదు. నాటి నాయకుల ఆలోచన వల్లే ఫార్మా, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీపడుతున్నాం. సిలికాన్‌ వ్యాలీలో మన పిల్లలు గొప్ప స్థానాల్లో ఉన్నారు. గతకాలపు నేతల నుంచి మంచిని నేర్చుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. భవిష్యత్తు తరాల కోసమే భారత్‌ ఫ్యూచర్‌ సిటీ. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్‌ తరహాలో ఫ్యూచర్‌సిటీ గురించి గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్‌లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్‌ సిటీ గురించి చెప్పుకునేలా అభివృద్ధి చేస్తాం’అని సీఎం తెలిపారు.  

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి 

చెన్నై, బెంగళూరుకు బుల్లెట్‌ రైళ్లు.. బందర్‌కు రోడ్డు 
ఫ్యూచర్‌సిటీకి తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా, ఇతర నగరాలకు రవాణా సౌకర్యం, అంతర్జాతీయ విమానాశ్ర యం వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ‘ఫ్యూచర్‌ సిటీ నుంచి శ్రీశైలం వరకు 100 మీటర్ల రోడ్డు వేస్తున్నాం. ఇటు ఫ్యూచర్‌ సిటీ నుంచి బెంగళూరు వరకు రోడ్డు, బుల్లెట్‌ ట్రైన్‌ మంజూరు చేయించుకున్నాం. దక్షిణ భారతదేశంలో నౌకాశ్రయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్ర మే. ఈ కొరతను తీర్చేందుకు మచిలీపట్నం వరకు రోడ్డు వేస్తున్నాం. ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు బుల్లెట్‌ ట్రైన్‌కు కేంద్రం అనుమతించింది’అని చెప్పారు. రైతులు నాయకుల ఉచ్చులో చిక్కుకుని నష్టపోవద్దని సూచించారు. బాధిత రైతులతో మాట్లాడి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్, టీజీఐఐసీ అధికారులను ఆదేశించారు. ‘అందరికీ న్యాయం చేస్తా. కోర్టు బయట కూర్చొని నష్టాన్ని పూడ్చుకుందాం’అని సూచించారు.  

భవిష్యత్తు అంతా ఇక్కడే 
దేశ భవిష్యత్తు అంతా ఫ్యూచర్‌ సిటీ చుట్టే తిరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ఏ నగరానికి లేని రేడియల్‌ రోడ్లు, సరీ్వసు రోడ్లు, మెట్రో సౌకర్యం దీనికి ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఈ సిటీ ప్రపంచానికే తలమానికం అవుతుందన్నారు. ఈ ప్రాంత వాసులకు అత్యాధునిక వైద్యశాలలు, కాలేజీలు, వర్సిటీలు, పరిశ్రమలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. సింగరేణి గ్లోబల్‌ కార్పొరేషన్‌ ఆఫీసు నిర్మాణాన్ని ఏడాదిలోపే పూర్తి చేస్తామని వెల్లడించారు. కొత్త యుగానికి కొత్త బాటలు వేయాలనే ఆలోచనతో ప్రణాళికాబద్ధమైన ఫ్యూచర్‌సిటీకి శంకుస్థాపన చేసినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. చండీగఢ్‌ కంటే పది రెట్లు భిన్నంగా ఫ్యూచర్‌సిటీ రాబోతోందని చెప్పారు. సిటీ నిర్మాణం, అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement