సిటీలో మరో స్టీల్‌ బ్రిడ్జి | - | Sakshi
Sakshi News home page

సిటీలో మరో స్టీల్‌ బ్రిడ్జి

Jan 3 2026 8:38 AM | Updated on Jan 3 2026 8:38 AM

సిటీలో మరో స్టీల్‌ బ్రిడ్జి

సిటీలో మరో స్టీల్‌ బ్రిడ్జి

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఎలివేటెడ్‌ స్టీల్‌బ్రిడ్జి కారిడార్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చర్యలు చేపట్టింది. వీఎస్‌టీ నుంచి అశోక్‌నగర్‌ వరకు నిర్మించిన బ్రిడ్జి తరహాలోనే ప్యారడైజ్‌– శామీర్‌పేట్‌ మధ్య 18.18 కి.మీ మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.4,263 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ బేకమ్‌ దక్కించుకుంది. రానున్న రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. వెస్ట్‌ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్‌, హకీంపేట్‌, తూంకుంట మీదుగా శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు నిర్మించే ఈ స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌ నుంచి నేరుగా ఔటర్‌ మీదుగా రాజీవ్‌ రహదారికి రాకపోకలు సాగించవచ్చు. నగరానికి ఉత్తరం వైపున మేడ్చల్‌ రూట్‌లో ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫామ్‌ వరకు చేపట్టిన మరో ఎలివేటెడ్‌ కారిడార్‌తో రెండు మార్గాల్లోనూ ప్రయాణ సదుపాయాలు మెరుగుపడతాయి.

స్టీల్‌ బ్రిడ్జి ఎలివేటెడ్‌ కారిడార్‌ ఇలా..

● ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు 18.18 కి.మీ నిర్మాణంలో 11.52 కి.మీ. ఎలివేటెడ్‌ కారిడార్‌ ఉంటుంది. హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ వద్ద 6 లేన్‌లతో టన్మెల్‌ నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్‌ వద్ద రెండు చోట్ల వాహనదారులు బ్రిడ్జిపైకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు ఎంట్రన్స్‌, ఎగ్జిట్‌లు ఉంటాయి.

● ఈ ప్రాజెక్టు కోసం 9.35 కి.మీల మార్గంలో 114.50 ఎకరాల రక్షణశాఖ భూములను, 8.35 కి.మీ.మార్గంలో 78.39 ఎకరాల ప్రైవేట్‌ భూ ములను సేకరించారు. 967 నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంటుంది.

వేగిరంగా డెయిరీఫామ్‌ కారిడార్‌..

ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి మేడ్చల్‌ రూట్‌లో డెయిరీఫామ్‌ వరకు 5.40 కి.మీ వరకు చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ పనులు వేగిరంగా కొనసాగుతున్నాయి. ఈ కారిడార్‌ పనులు 36 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ మీదుగాా మెదక్‌, నిజామాబాద్‌ మార్గంలో రాకపోకలు సులభతరమవుతాయి.

ప్యారడైజ్‌ టు శామీర్‌పేట్‌

18.18 కి.మీ మేర వంతెన

రూ.4,263 కోట్ల అంచనా

త్వరలో పనులు ప్రారంభం

రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం

చర్యలు చేపట్టిన హెచ్‌ఎండీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement