ఆరు నెలల్లో ‘పాలమూరు’ నీరు | CM Revanth Reddy Says about Palamuru-Ranga Reddy project | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో ‘పాలమూరు’ నీరు

Jun 5 2026 1:00 AM | Updated on Jun 5 2026 1:00 AM

CM Revanth Reddy Says about Palamuru-Ranga Reddy project

నారాయణపేట జిల్లా కాట్రేవుపల్లి సమీపంలో మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫొటో ఎగ్జిబిషన్‌లో ప్రాజెక్టు వివరాలను తెలుపుతున్న ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులు, చిత్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు

నార్లాపూర్‌ నుంచి కర్వెన వరకు అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

భూసేకరణ తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణం పనులు 

భూసేకరణ, పునరావాసానికే తొలుత నిధుల కేటాయింపు 

యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే..  

ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూసుకుంటాం.. 

మంత్రులు.. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, అధికారులతో సమన్వయం చేసుకోవాలి.. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష 

తొలిరోజు వడివడిగా ప్రాజెక్టుల సందర్శన.. నేడు జడ్చర్ల సమీపంలో బహిరంగసభ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌కర్నూల్‌/సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 నెలల్లో కర్వెన రిజర్వాయర్‌ వరకు నీరందించాలని చెప్పారు. దీంతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను సత్వరంగా పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. ప్రధాన భూసేకరణను వేగవంతం చేయాలని, ఈ బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ పూర్తయిన తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్‌లో అధికారులతో రేవంత్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వేగంగా పూర్తిచేయాలని సీఎం చెప్పారు. నార్లాపూర్, ఏదుల, కరివెన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాగా, వీటి లింకేజీకి సంబంధించి పెండింగ్‌ పనులను పూర్తిచేయాలన్నారు. వీటికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. నెలవారీగా ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ నిధులతో పూర్తయ్యే పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. ఆరు నెలల్లోగా కరివెన రిజర్వాయర్‌ వరకు నీళ్లు అందించే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని చెప్పారు. మరో 15 రోజుల తర్వాత ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షిస్తానన్నారు. ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్‌ అధికారులు సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.  
తొలి రోజు చకచకా..  
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం చకచకా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి పలు ప్రాజెక్టులను సందర్శించారు. కొడంగల్‌– నారాయణపేట– మక్తల్‌ ఎత్తిపోతలు, గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌ పనుల ప్రగతిపై స్వయంగా ఆరా తీశారు. కోయిల్‌సాగర్, కృష్ణా, భీమా నదులపై రోడ్‌ కం బరాజ్‌ల ప్రతిపాదిత స్థలం, జూరాల డ్యామ్‌ను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు సమీక్ష నిర్వహించిన అనంతరం సోమశిలలోని మృగవాణి రిసార్ట్‌లో రేవంత్‌రెడ్డి బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్‌ఐలో భాగమైన పలు రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపూర్‌ రోడ్‌లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. 

హామీల అమలుకు కట్టుబడి... 
మక్తల్‌– నారాయణపేట– కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూనే నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీటిపారుదల రంగాన్ని మరింత బలోపేతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా పురోగతిపై రేవంత్‌రెడ్డి ఒక్కో ప్యాకేజీలో పెండింగ్‌ పనులకు గత కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ పనులు నూరు శాతం పూర్తికాగా, ఏదుల రిజర్వాయర్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. వట్టెం రిజర్వాయర్‌ కట్ట పనులు పూర్తికాగా, ప్రస్తుతం కాంక్రీట్, రివిట్‌మెంట్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. గడువులోగా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల అంచనాలను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు.  

కీలకమైన కాల్వల నిర్మాణంపై... 
గరిష్ట ప్రయోజనాల కోసం కీలకమైన కాల్వల నిర్మాణం పైనే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. నిధుల అవసరాలు, కాలపరిమితులతో కూడిన వాస్తవిక గడువులను సిద్ధం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారన్నారు. కోర్టు కేసుల్లో ఉన్నవి, పనులపై స్టే విధించిన వాటి విషయంలో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను మొదటి ప్రాధాన్యతగా భావించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement