యాదగిరిగుట్టలో భూకేటాయింపులకు టీటీడీ విధానం | CM Revanth Reddy orders Yadagirigutta land policy seeks TTD model for allotments | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టలో భూకేటాయింపులకు టీటీడీ విధానం

Jul 1 2026 6:05 AM | Updated on Jul 1 2026 6:05 AM

 CM Revanth Reddy orders Yadagirigutta land policy seeks TTD model for allotments

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో చామల, రఘువీర్‌రెడ్డి, జయేశ్‌రంజన్, శైలజా రామయ్యర్, సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులు

అధ్యయనం చేసి నిబంధనలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలు, సంస్థలు, కుల సంఘాలకు భూములు కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానాన్ని రూపొందించాలని.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంస్థలకు, సంఘాలకు ఏ ప్రాతిపదికన స్థలాలు కేటాయించినప్పటికీ ఆ భూముల యాజమాన్య హక్కులు మాత్రం దేవస్థానం వద్దే ఉండాలని ఆయన తేల్చిచెప్పారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో మంగళవారం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపై అతిథిగృహాల నిర్మాణం కోసం ముందుకొచ్చే దాతలు, సంస్థల జాబితాను సిద్ధం చేయాలని.. ఈ నిర్మాణాల్లోనూ టీటీడీ విధానాన్ని అనుసరిస్తూ సంస్థలకు విడతలవారీగా మాత్రమే కేటాయింపులు జరగాలని స్పష్టం చేశారు. అలాగే యాదగిరిగుట్టలో హరేరామ హరే కృష్ణ ఫౌండేషన్‌ కోసం మార్కెట్‌ ధర ప్రకారమే భూమిని కేటాయించాలని సీఎం సూచించారు. 

పీపీపీ విధానంలో యాదగిరిగుట్టలో టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధి
యాదగిరిగుట్టలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన సాంకేతిక నివేదికపై అధ్యయనం చేసి వారంలోగా తనకు నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. వాటితోపాటు పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ కమిషనర్‌ ఎం. హనుమంతరావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement