
స్థానిక పెట్టుబడిదారులనూ ప్రోత్సహిస్తున్నాం
పాలసీల్లో పారదర్శకత ఉంటేనే అభివృద్ధి సాధ్యం
నేను మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రిని
సంపద దోచి విదేశాలకు తరలించాలన్న కోరిక లేదు
సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టికరణ
హైటెక్స్‌లో క్రెడాయ్
హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభం
మాదాపూర్: రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత తన ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. స్వదేశీ పెట్టుబడిదారులను నిర్లక్ష్యం చేస్తున్నామని కొందరు తమపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ దేశాలు తిరిగి పెట్టుబడులు తెస్తున్న తాము.. మనదేశంలోని పెట్టుబడిదారులను ఎందుకు ప్రోత్సహించం అని ప్రశ్నించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వచ్చి అభివృద్ధి దానంతట అదే వేగంగా జరుగుతుంది. గతంలో పాలించినవారు పాలసీ పెరాలసిస్ లేకుండా చూడడం వల్లనే నేడు మన హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడగలుగుతోంది. మీరు అపోహలకు లోబడితే అది అంతిమంగా రాష్ట్రానికి, దేశానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. పోటీ పడండి, పాలసీలు అడగండి, అభివృద్ధి ఎలా చేయాలో సూచనలు ఇవ్వండి. మీ అనుభవాన్ని మాతో పంచుకోండి’అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
ఎయిర్‌పోర్టులు పెరిగితే మరింత అభివృద్ధి
గత పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరుమీద 11.5 శాతం వడ్డీకి రూ.1 లక్ష కోట్ల అప్పు తెస్తే.. తాను 50 సార్లు ప్రధానమంత్రిని కలిసి రుణ పునర్వ్యవస్థీకరణ చేయించి, వడ్డీని 7.5 శాతానికి తగ్గించానని సీఎం తెలిపారు. ‘తెలంగాణలో ఒక్కటే ఎయిర్‌పోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరేడు ఉన్నాయి. మహారాష్ట్రలో 40 ఉన్నాయి. తెలంగాణకు అదనంగా వరంగల్‌లో ఒకటి, ఆదిలాబాద్‌లో మరొక ఎయిర్‌పోర్టుకు అనుమతులు తెచ్చాం. ఎయిర్‌పోర్టులు వస్తే రెండు, మూడోస్థాయి నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయి.
పారిశ్రామికాభివృద్ధి జరిగితే ప్రజల, ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీని మన రాష్ట్రానికి ఆహ్వనిస్తే పోర్ట్ ఎంతదూరం ఉందని అడుగుతున్నారు. ఔటర్ రింగురోడ్డు 160 కిలోమీటర్ల నిర్మాణం జరిగితే రాష్ట్ర ఆదాయం రూ.3 లక్షల కోట్లకు చేరింది. అందుకే 360 కిలోమీటర్ల రీజినల్ రింగు రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం.
రీజినల్ రింగురోడ్డుతోపాటు రీజినల్ రింగ్‌రైల్, ఫ్యూచర్‌సిటీ టు అమరావతి, బందర్ పోర్ట్ లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే, రైల్వే కనెక్టివిటీ ఏర్పా టు చేసి ఇరువైపులా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టాం’అని వివరించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.జయదీప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్‌రెడ్డి, కనీ్వనర్ కుర్ర శ్రీనాథ్, కో కన్వీనర్ అరవింద్‌రావు, జాతీయ అధ్యక్షుడు రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేను మిడిల్ క్లాస్ సీఎంను
తమ ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తోందని సీఎం తెలిపారు. ‘నేను సగటు మధ్యతరగతి అలోచన ఉన్న ముఖ్యమంత్రిని. సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న అలోచన నాకు లేదు’అని స్పష్టంచేశారు. ప్రయాణికులు అధికంగా ఉండే మార్గాల్లోనే మెట్రో రైల్ విస్తరణ ఉంటుందని తేల్చి చెప్పారు.
‘హైటెక్ సిటీ పక్కన చెరువులు, అడవులే అధికం. ఇక్కడ మెట్రో రైల్ ఎవరు ఎక్కుతారు? అందుకే నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొత్త హైకోర్టు, శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రీడిజైన్ చేశాం. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు దాటి మెట్రోను పొడిగించాలి. మెట్రోకి, మూసీ ప్రక్షాళనకు, ఎలివేటెడ్ కారిడార్స్‌కు అనుమతులతోపాటు నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం నుంచి మేం తెచ్చిన అనుమతుల జాబితాను అసెంబ్లీలో పెడతాం’అని సీఎం తెలిపారు.