కార్పొరేషన్ చైర్మన్లుగా రెండోసారి అవకాశం ఇవ్వకూడదని సీఎం నిర్ణయం!
కొత్త వారికే అన్ని పదవులూ ఇవ్వాలనే యోచన
పనితీరు ప్రాతిపదికగా కొందరికి మళ్లీ అవకాశం ఇస్తారనే చర్చకు చెక్
జూలైలోపు అన్ని కార్పొరేషన్లకు ఒకేసారి చైర్మన్ల నియామకం?
మున్సిపల్ ఎన్నికల కోసం లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరికీ మరోమారు అవకాశం ఇవ్వకూడదని, ఈ పదవులను ఎప్పుడు భర్తీ చేసినా అంతా కొత్తవారినే నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే చైర్మన్లను నియమించిన 35 కార్పొరేషన్లతో పాటు మిగతా కార్పొరేషన్లకు కూడా ఒకేసారి చైర్మన్లను నియమించాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారి పద వీకాలం ఈ ఏడాది జూలైలో ముగియనున్నందున ఆ లోపు ఒకేసారి ఈ పదవులన్నింటినీ భర్తీ చేయాలనే నిర్ణయం కూడా జరిగిందని సమాచారం.
తలనొప్పి ఎందుకనే..!
2024 మార్చి నెలలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. కానీ అధికారిక ఉత్తర్వులు వచ్చి వారు పదవీ బాధ్యతలు స్వీకరించే సరికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. జూలై 8న వారంతా అధికారికంగా చైర్మన్లుగా నియమితులయ్యారు. దీంతో వారి రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జూలై రెండో వారంలో ముగియనుంది. అయితే ఇలా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న చైర్మన్లు తమకు మళ్లీ అవకాశం ఇస్తారేమోనన్న ఆశతో ఉన్నారు. ఈ మేరకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసినందున ఓ దఫా చైర్మన్లుగా అవకాశం ఇచ్చామని, రెండోసారి అవకాశం దక్కాలంటే పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల విస్తృత ప్రచారం కోసం పనిచేయాలని గతంలో పలుమార్లు సీఎం, పీసీసీ అధ్యక్షుడు, పార్టీ ఇన్‌చార్జి చెప్పారు. దీంతో పలువురు చైర్మన్లు ఆ రకంగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ కాకపోయినా పనితీరు ప్రాతిపదికన కొందరికి మళ్లీ చాన్స్ దక్కవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. కానీ కొందరికి ఇచ్చి మరికొందరిని పక్కన పెట్టడం వల్ల లేని తలనొప్పులు వస్తాయని, ఎలాగూ ఒకసారి అవకాశమిచ్చినందున మలిదఫాలో పూర్తిగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్, రాష్ట్ర పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది.
పార్టీ జిల్లా కమిటీలు ప్రస్తుతానికి పెండింగే!
మున్సిపల్ ఎన్నికలకు ముందు తలనొప్పి ఎందుకులే అనే ఆలోచనతో పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటును పీసీసీ ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. వాస్తవానికి జనవరి 11 నాటికే జిల్లా కమిటీలు, 15 నాటికి మండల పార్టీ అధ్యక్షుల నియామకాలను పూర్తి చేసి తమకు పంపాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. కానీ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఎవరికి ఏ పదవి ఇస్తే ఏమవుతుందోననే మీమాంసతో ఎమ్మెల్యేలు, మంత్రులు చాలావరకు జిల్లా కమిటీల కోసం పూర్తి స్థాయిలో పేర్లను ఇవ్వలేదు. మండల పార్టీ అధ్యక్షుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పీసీసీ నిర్ణయించింది.
మున్సిపల్ వ్యూహంలో గందరగోళం!
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం ఆ పార్టీ నేతలను గందరగోళానికి గురి చేస్తోంది. మంత్రులను వారు ప్రాతినిథ్యం వహిస్తున్న చోట కాకుండా వేరేచోట ఇన్‌చార్జిలుగా నియమించడమే ఇందుకు కారణం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మంత్రులను వేరే పార్లమెంటు స్థానాలకు ఇన్‌చార్జులుగా నియమించడం వల్ల వారు సొంత నియోజకవర్గాలకు సమయం ఇవ్వగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రులు చాలా జిల్లాలకు అసలు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నారు.
మిగిలిన అసెంబ్లీల విషయంలో.. స్థానిక ఎమ్మెల్యేలు, అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు వారికి సహకరించక పోవడమే కారణమనే వాదన ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జులుగా వారు ఏ మేరకు పార్టీ నేతలను, కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్లమెంటు స్థానాల వారీగా ఇన్‌చార్జులను నియమిస్తున్నట్టు సీఎం కార్యాలయం అధికారికంగా ప్రకటిస్తే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అవే పార్లమెంటు స్థానాల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా, పార్లమెంటు పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కనీ్వనర్లుగా ఉండే ఈ కమిటీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారని, టికెట్ల ఖరారులో ఈ కమిటీలదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు.
లోక్‌సభ స్థానాల వారీగా ఇన్‌చార్జి మంత్రులు వీరే!
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (మల్కాజిగిరి), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (చేవెళ్ల), తుమ్మల నాగేశ్వరరావు (కరీంనగర్), కొండా సురేఖ (ఖమ్మం), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్), దామోదర రాజనర్సింహ (మహబూబ్‌నగర్), మహ్మద్ అజహరుద్దీన్ (జహీరాబాద్), వివేక్ వెంకటస్వామి (మెదక్), వాకిటి శ్రీహరి (నాగర్‌కర్నూల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (నల్లగొండ), సీతక్క (భువనగిరి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నిజామాబాద్), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), జూపల్లి కృష్ణారావు (పెద్దపల్లి), సుదర్శన్‌రెడ్డి, సలహాదారు (ఆదిలాబాద్)లను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జులుగా నియమించారు.


