breaking news
corporation chairmen post
-
మరో చాన్స్ లేదు!
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరికీ మరోమారు అవకాశం ఇవ్వకూడదని, ఈ పదవులను ఎప్పుడు భర్తీ చేసినా అంతా కొత్తవారినే నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే చైర్మన్లను నియమించిన 35 కార్పొరేషన్లతో పాటు మిగతా కార్పొరేషన్లకు కూడా ఒకేసారి చైర్మన్లను నియమించాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారి పద వీకాలం ఈ ఏడాది జూలైలో ముగియనున్నందున ఆ లోపు ఒకేసారి ఈ పదవులన్నింటినీ భర్తీ చేయాలనే నిర్ణయం కూడా జరిగిందని సమాచారం.తలనొప్పి ఎందుకనే..! 2024 మార్చి నెలలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. కానీ అధికారిక ఉత్తర్వులు వచ్చి వారు పదవీ బాధ్యతలు స్వీకరించే సరికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. జూలై 8న వారంతా అధికారికంగా చైర్మన్లుగా నియమితులయ్యారు. దీంతో వారి రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జూలై రెండో వారంలో ముగియనుంది. అయితే ఇలా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న చైర్మన్లు తమకు మళ్లీ అవకాశం ఇస్తారేమోనన్న ఆశతో ఉన్నారు. ఈ మేరకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసినందున ఓ దఫా చైర్మన్లుగా అవకాశం ఇచ్చామని, రెండోసారి అవకాశం దక్కాలంటే పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల విస్తృత ప్రచారం కోసం పనిచేయాలని గతంలో పలుమార్లు సీఎం, పీసీసీ అధ్యక్షుడు, పార్టీ ఇన్చార్జి చెప్పారు. దీంతో పలువురు చైర్మన్లు ఆ రకంగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ కాకపోయినా పనితీరు ప్రాతిపదికన కొందరికి మళ్లీ చాన్స్ దక్కవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. కానీ కొందరికి ఇచ్చి మరికొందరిని పక్కన పెట్టడం వల్ల లేని తలనొప్పులు వస్తాయని, ఎలాగూ ఒకసారి అవకాశమిచ్చినందున మలిదఫాలో పూర్తిగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్, రాష్ట్ర పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ జిల్లా కమిటీలు ప్రస్తుతానికి పెండింగే! మున్సిపల్ ఎన్నికలకు ముందు తలనొప్పి ఎందుకులే అనే ఆలోచనతో పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటును పీసీసీ ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. వాస్తవానికి జనవరి 11 నాటికే జిల్లా కమిటీలు, 15 నాటికి మండల పార్టీ అధ్యక్షుల నియామకాలను పూర్తి చేసి తమకు పంపాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. కానీ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఎవరికి ఏ పదవి ఇస్తే ఏమవుతుందోననే మీమాంసతో ఎమ్మెల్యేలు, మంత్రులు చాలావరకు జిల్లా కమిటీల కోసం పూర్తి స్థాయిలో పేర్లను ఇవ్వలేదు. మండల పార్టీ అధ్యక్షుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పీసీసీ నిర్ణయించింది. మున్సిపల్ వ్యూహంలో గందరగోళం! మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం ఆ పార్టీ నేతలను గందరగోళానికి గురి చేస్తోంది. మంత్రులను వారు ప్రాతినిథ్యం వహిస్తున్న చోట కాకుండా వేరేచోట ఇన్చార్జిలుగా నియమించడమే ఇందుకు కారణం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మంత్రులను వేరే పార్లమెంటు స్థానాలకు ఇన్చార్జులుగా నియమించడం వల్ల వారు సొంత నియోజకవర్గాలకు సమయం ఇవ్వగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు చాలా జిల్లాలకు అసలు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. మిగిలిన అసెంబ్లీల విషయంలో.. స్థానిక ఎమ్మెల్యేలు, అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు వారికి సహకరించక పోవడమే కారణమనే వాదన ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జులుగా వారు ఏ మేరకు పార్టీ నేతలను, కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్లమెంటు స్థానాల వారీగా ఇన్చార్జులను నియమిస్తున్నట్టు సీఎం కార్యాలయం అధికారికంగా ప్రకటిస్తే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అవే పార్లమెంటు స్థానాల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా, పార్లమెంటు పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కనీ్వనర్లుగా ఉండే ఈ కమిటీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారని, టికెట్ల ఖరారులో ఈ కమిటీలదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానాల వారీగా ఇన్చార్జి మంత్రులు వీరే! కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (మల్కాజిగిరి), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (చేవెళ్ల), తుమ్మల నాగేశ్వరరావు (కరీంనగర్), కొండా సురేఖ (ఖమ్మం), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్), దామోదర రాజనర్సింహ (మహబూబ్‌నగర్), మహ్మద్ అజహరుద్దీన్ (జహీరాబాద్), వివేక్ వెంకటస్వామి (మెదక్), వాకిటి శ్రీహరి (నాగర్‌కర్నూల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (నల్లగొండ), సీతక్క (భువనగిరి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నిజామాబాద్), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), జూపల్లి కృష్ణారావు (పెద్దపల్లి), సుదర్శన్‌రెడ్డి, సలహాదారు (ఆదిలాబాద్)లను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులుగా నియమించారు. -
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
దసరాలోపే నామినేటెడ్ పోస్టుల భర్తీ
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దసరా పండుగలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. వారంలోగా నామినేటెడ్ పోస్టులకు ఆశావహుల జాబితాను అందించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. గురువారం ముగిసిన టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏ క్షణంలోనైనా ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రావొచ్చునని, అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరిస్తే పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలపై సర్వే నిర్వహించామని, వరంగల్‌లో 67శాతం, నారాయణఖేడ్‌లో 52శాతం మనకే అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయని తెలిపారు. త్వరలో 17 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను భర్తీ చేస్తామని భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు ఐదు చైర్మన్ పదవులు ఇస్తామని చెప్పారు. దసరా నుంచే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రులు అందర్నీ కలుపుకొనిపోవాలని, పార్టీలో కొత్తా, పాతా భేదం చూపొద్దని కేజీఆర్ సూచించారు. విపక్షాలను దీటుగా ఎదుర్కోవాలని నిర్దేశించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం ముగియడంతో కాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీకి బయలుదేరారు. ఈ నెల 23, 24 తేదీల్లో మరోసారీ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది.


