తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్‌.. పురసారథులకు ‘పరీక్ష’ | Sakshi
Sakshi News home page

తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్‌.. పురసారథులకు ‘పరీక్ష’

Published Wed, Jan 25 2023 3:51 PM

Telangana: Corporation Chairmans Tenure Extension File Pending at Governor - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 

గవర్నర్‌ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

మేడ్చల్‌ జిల్లాలో.. 
► మేడ్చల్‌ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్‌ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్‌ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు.  

► బోడుప్పల్‌ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్‌ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్‌ఎస్‌ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి.   

రంగారెడ్డి జిల్లాలో.. 
► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. 

► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్‌.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. 

► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌లో చేరి చైర్‌పర్సన్‌ పదవిని కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్‌ చేయండి: కేసీఆర్‌ ప్రభుత్వంపై గవర్నర్‌ అసంతృప్తి)

Advertisement
 
Advertisement
 
Advertisement