‘లోక్‌సభ’ నుంచే ఎంట్రీ! 

CM KCr Work On Road Map For BRS Entry Into National Politics - Sakshi

జాతీయ రాజకీయాల్లోకి బీఆర్‌ఎస్‌ ప్రవేశానికి రోడ్‌ మ్యాప్‌పై కసరత్తు 

2024 లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ.. అప్పటిదాకా ఎన్నికలకు దూరం 

ఈ మధ్యలో జరిగే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో భావసారూప్య పార్టీలకు మద్దతు 

కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ ప్రచారం 

వచ్చే ఏడాది మార్చి నాటికి ఢిల్లీలో శాశ్వత కేంద్ర కార్యాలయం, ఆవిర్భావ సభ 

తాత్కాలిక జాతీయ కార్యవర్గంలో వినోద్, కవిత, దాసోజు, రవీందర్‌ సింగ్‌లకు చోటు

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి భవిష్యత్‌ ప్రస్థానానికి సంబంధించిన రోడ్‌ మ్యాప్‌పై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్పుచేసే ప్రక్రియ పూర్తవడంతో వీలైనంత త్వరగా భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉన్నారు. ఈ నెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని పటేల్‌ మార్గ్‌లో పార్టీ తాత్కాలిక కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే మీడియా సమావేశంలో పార్టీ విధివిధానాలపై కేసీఆర్‌ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయం శాశ్వత భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి అది పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను ఈ ఏడాది డిసెంబర్‌ తొలివారంలోనే ఢిల్లీలో నిర్వహిస్తామని సంకేతాలిచ్చినా పేరు మార్పిడి ప్రక్రియ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. చలికాలం ముగిశాక మార్చి నెలాఖరులో ఢిల్లీలో పార్టీ శాశ్వత కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించడంతోపాటు ఆవిర్భావ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. 

2024 లోక్‌సభ ఎన్నికలతోనే అరంగేట్రం 
బీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో జాతీయ రాజకీయాల్లో కార్యకలాపాలకు మార్గం సుగమమైనా.. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో అరంగేట్రానికి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను వేదికగా మల్చుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలోపు తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా ఎన్నికల్లో స్థానికంగా కలిసి వచ్చే భావసారూప్య పార్టీలకు మద్దతివ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ తరఫున పరిశీలక, ప్రచార బృందాలను పంపడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ తరపున కేసీఆర్‌ ప్రచారంలో పాల్గొంటారు.

గతంలో హైదరాబాద్‌ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బీదర్, గుల్బర్గా, రాయచూరు, బళ్లారి, హోస్పేట తదితర ప్రాంతాల్లో కన్నడ భాషపై పట్టుకలిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, హన్మంత్‌ షిండేతో పాటు మరికొందరు నేతల సేవలను వినియోగించుకుంటామని ఇప్పటికే కేసీఆర్‌ ప్రకటించారు. 

చేరికలు, విలీనాలతో పార్టీ విస్తరణ 
బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ నాటికల్లా జాతీయస్థాయిలో పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారు. జాతీయస్థాయిలో ఆసక్తితో ఉన్న పార్టీలు, నేతలతో సంప్రదింపులు జరిపి.. కలిసి వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవడం, విలీనాలు వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. పార్టీ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.

ఆలోగా రాష్ట్రానికి చెందిన నేతలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, వివిధ రంగాల నిపుణులతో పొలిట్‌బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ప్రత్యేక పాలసీలు రూపొందిస్తామని కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ రాజ్యాంగం, విధివిధానాల రూపకల్పనకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై లోతైన అవగాహన కలిగిన వారికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.

పార్టీ జాతీయ కార్యకలాపాల సమన్వయంలో తోడ్పాటు అందించడంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌ భాస్కర్, దాసోజు శ్రవణ్, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ తదితరులతో కూడిన బృందం క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టు సమాచారం. త్వర లో ప్రకటించే బీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరోలో వీరిలో కొందరికి ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం టాస్క్‌ఫోర్స్‌ 
జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ కార్యకలాపాల విస్తరణ, పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూనే.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ల నూతన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా ఉన్న సీఎం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పాలనాపరమైన అంశాలను తుదిదశకు చేర్చే యోచనలో ఉన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతోపాటు మరికొందరు నేతలతో ‘టాస్క్‌ఫోర్స్‌’ఏర్పాటు చేసి.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను ముమ్మరం చేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top