ఆంధ్రా రైతుకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ | CM KCR Phone Call To AP Farmer | Sakshi
Sakshi News home page

ఆంధ్రా రైతుకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

Dec 20 2020 4:03 PM | Updated on Dec 20 2020 6:50 PM

CM KCR Phone Call To AP Farmer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కృష్ణా జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావుకు ఫోన్‌ చేసి, వెద సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాలలో విశేష కృషి చేసిన ప్రసాదరావు అనుభవాలను తెలంగాణాలో ఆచరించేందుకు కేసీఆర్ ఆయన్ను స్వయంగా విందుకు ఆహ్వానించారు. తనతో దాదాపు 10 నిమిషాలు ఫోన్లో సంభాషించిన సీఎం కేసీఆర్ వెద పద్దతిలో వరి సాగులో దిగుబడులు, ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారని, రెండు రోజుల్లో తనను కలిసేందుకు కారు పంపుతానని చెప్పారని ప్రసాదరావు తెలిపారు. (బీజేపీకి షాక్‌.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా!)

ఈ సందర్భంగా ప్రసాదరావు సాక్షితో మాట్లాడుతూ.. తాను సాగు చేసే పద్ధతులు వివరించారు. వ్యవసాయంతో పాటు 250 గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ల పెంపకం చేస్తున్నానని దీని కారణంగా పొలానికి మంచి సేంద్రియ ఎరువులు అంది.. భూమి ఆరోగ్యం మెరుగై దిగుబడులు పెరుగుతున్నాయని వివరించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు స్వయంగా ఫోన్ చేసి సాగు అనుభవాలు తెలుసుకోవటం, విందుకు ఆహ్వానించటం గర్వంగా ఉందని తెలిపారు. వెద సాగుతో ఖర్చులు తగ్గటమే కాక దిగుబడి పెరుగుతుందన్న విషయం రైతులు గుర్తించాలని ప్రసాదరావు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement