బయటికి రావొద్దు!.. సీఎం కేసీఆర్‌ హెచ్చరిక

CM KCR Ordered Entire Government Machinery To Be Alert Heavy Rains - Sakshi

భారీ వర్షాలు, వరదలపై జాగ్రత్త.. ప్రజలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి 

అధికార యంత్రాంగమంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలి

ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచండి 

జిల్లాల్లో ప్రజాప్రతినిధులు సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచన 

తాను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని వెల్లడి 

ఈ నెల 15 నుంచి తలపెట్టిన రెవెన్యూ సదస్సులు వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తాను కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తానని, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని తెలిపారు.

వాతావరణశాఖ తెలంగాణలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో.. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు. వరదలతో ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వరద, ముంపు ఉండే ప్రాంతాలను గుర్తించి, అధికారులను, ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీంలను సిద్ధం చేయాలని.. ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు స్థానికంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. 

రెవెన్యూ సదస్సులు వాయిదా 
ఈ నెల 11న ప్రగతిభవన్‌లో తలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల సమావేశంతోపాటు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టదలచిన ‘రెవెన్యూ సదస్సు’లను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామన్నారు. 

స్వీయ జాగ్రత్తలు పాటించండి
భారీ వానలు, వరదల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అంతా తగిన స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. నదులు, వాగులు ఉప్పొంగుతుండటం, రిజర్వాయర్లు నిండుతుండటంతో.. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top