సాక్షి, హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల క్రమబద్ధీకరణ కోసం ట్రాఫిక్ విభాగం ఏర్పాటైంది. తాజాగా శనివారం గ్రేటర్‌లో 20 మంది ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ వింగ్‌కు పలువురు అధికారులను బదిలీ చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఉన్న చందనా దీప్తి.. ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగానికి అదనపు కమిషనర్‌గా, కమిషనరేట్ అడ్మిన్‌గా బదిలీ అయ్యారు. 2012 బ్యాచ్‌కు చెందిన చందనా దీప్తిది వరంగల్ జిల్లా. ఈమె ఇటీవలే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా పదోన్నతి పొందారు. ఇప్పటివరకు ములుగు హెడ్ క్వార్టర్స్‌లో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివం ఉపాధ్యాయకు ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా స్థానచలనం కలిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడాది తిరక్కుండానే..
గతేడాది ఫిబ్రవరిలో డాక్టర్ గజారావు భూపాల్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా బదిలీ చేసిన ప్రభుత్వం.. ఏడాది కాలం కూడా గడవక ముందే మళ్లీ బదిలీ చేసింది. ఈయన్ని ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ ఐజీగా స్థానచలనం కలి్పంచారు. దీంతో పాటు భూపాల్ రావు స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్‌కు పూర్తి అదనపు చార్జ్ బాధ్యతలు వహిస్తారు. ప్రస్తుతానికి భూపాల్ రావు స్థానంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా ఎవరినీ నియమించలేదు.


