రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు: కిషన్‌ రెడ్డి

Central Minister Kishan Reddy Fires On CM KCR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రైతులు స్వేచ్ఛగా తమ పంటలను లాభసాటి ధరకు అమ్ముకునేలా తమ ప్రభుత్వం చట్టం తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ రైతుల పంటల అమ్మకంపై ఉన్న ఆంక్షలు తొలగించిందన్నారు. కనీస మద్దతు ధర విషయంలో ఎలాంటి మార్పు చేయలేదని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతు చట్టాలపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, రైతులకు నష్టం కలిగించే చర్యలను కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని విమర్శించారు. (చదవండి: షాద్‌నగర్‌లో కేటీఆర్‌.. సిద్ధిపేటలో హరీష్‌రావు)

నిరసనలతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో ఎరువుల కొరత లేకుండా చేశామని, రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధరలు కల్పించామన్నారు. సన్న బియ్యం వేయమని చెప్పిన కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పడు చేతులెత్తేసిందని మండిపడ్డారు. (చదవండి: ఢిల్లీతో ఢీకి టీఆర్‌ఎస్‌ రెడీ​)

ఆ బాధ్యతను కేంద్రంపై నెట్టి వేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. కాగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. చట్టాలను మార్చాలంటూ రైతుల ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలతో పాటు పలువురు రైతులకు మద్దతుగా భారత్‌ బంద్‌కు సంఘీభావం తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కూడా రైతుల సంఘీభావం తెలుపుతూ భారత్‌ బంద్‌కు మద్దతు తెలిపింది.

బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకే..: లక్ష్మణ్‌
కాంగ్రెస్ అనుబంధ రైతు సంఘాల బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోందని.. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. రుణ మాఫీ చేయలేని  కేసీఆర్‌.. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ ఉచ్చులో పడొద్దని  రైతులకు లక్ష్మణ్‌ సూచించారు.

రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు:డీకే అరుణ
రైతులకు వ్యతిరేకంగా చట్టాల్లో ఒక్క పదం కూడా లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ఈ చటాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. రైతులను కొందరు తప్పు దోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top